ఉత్తరాంధ్రలో జవాద్ తుఫాన్ పరిస్థితులపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, ఇతర ఉన్నతస్థాయి అధికారులు హాజరయ్యారు. జగన్ మాట్లాడుతూ అధికారులకు సూచనలు చేశారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్ ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
సహాయ చర్యల్లో ఏ లోపం ఉండకూడదన్నారు. జిల్లాలకు వెళ్లిన ప్రత్యేకాధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయ శిబిరాల్లో ఆహారం నాణ్యంగా ఉండాలని సూచించారు. మంచినీరు, టాయిలెట్లు.. ప్రతి ఒక్కటీ నీట్‌గా ఉండాలన్నారు. అన్ని జిల్లాలలో అవసరమైన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు అంఉదబాటులో ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు మరోసారి అన్ని చోట్ల పరిస్థితులు సమీక్షించానలి సీఎం అధికారులను ఆదేశించారు. ఇంకా అదనపు బృందాలను కూడా అందుబాటులో ఉండేలా జాగ్రత్త వహించాలన్నారు.
ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ప్రజలను ముందుగా అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. చెరువులు, కాల్వలు, రిజర్వాయర్ల కట్టలు ఎలా ఉన్నాయన్నది పరిశీలించాలన్నారు. ఎక్కడైనా వాటికి గండ్లు పడ్డాయని తెలిసినా లేదా బలహీనంగా ఉన్నాయని గుర్తించినా వెంటనే జల వనరుల శాఖ అధికారులతో మాట్లాడి మరమ్మతులు చేపట్టాలన్నారు. ఇప్పటికిప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు తుపాన్ ముప్పు లేనప్పటికీ, అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఉండండి.
ఏ పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలి: సీఎస్ సమీర్‌శర్మ
ఉత్తరాంధ్రతో పాటు, ఉభయ గోదావరి జిల్లాలలో ఏ పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి పూర్తి అప్రమత్తంగా ఉన్నాం- ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్న సీఎస్ డాక్టర్ సమీర్‌శర్మ అన్నారు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఆయా జిల్లాలకు ఇప్పటికే సహాయక బృందాలను పంపినట్టు తెలిపారు. ఇప్పటికే 11 ఎన్డీఆర్‌ఎఫ్, 6 కోస్ట్‌గార్డ్, 10 మెరైన్ పోలీస్ బృందాలు, 5 ఎస్డీఆర్‌ఎఫ్, 18 ఫైర్ సర్వీస్ టీమ్‌లను ఉత్తరాంధ్ర జిల్లాలలో మొహరించామని సీఎస్ సీఎం జగన్‌కు తెలిపారు.
115 జేసీబీలు, 115 టిప్పర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 232 నీళ్ల ట్యాంకర్లు, 295 డీజిల్ జనరేటర్లు, 46,322 మెట్రిక్ టన్నుల బియ్యం, 1,018 మెట్రిక్ టన్నుల పప్పులు, 41,032 లీటర్ల వంటనూనె, 391 టన్నుల పంచదారను ఆయా జిల్లాలకు పంపించినట్టు వివరించారు. వైద్య బృందాలు, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని 54 వేల కుటుంబాలను సహాయ శిబిరాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని సీఎస్ వెల్లడించారు. ఈ తుఫాన్ ఈనెల 5వ తేదీ మధ్యాహ్నం పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.దీని ప్రభావం వల్ల రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.