Temperatures in AP have been rising since the beginning of summer
వేసవి కాలం కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. ఆదిలోనే భానుడు భగభగ మంటున్నాడు. మొన్నటి వరకు శీతాకాలం పిల్లగాలులతో సేదతీరిన ప్రజలు ఇప్పుడు రుద్ర రూపం ఎత్తబోతున్న సూర్యుడి ప్రతాపాగ్ని జ్వాలలకు చెమటలు కక్కనున్నారు. అయితే ఎండాకాలం ప్రారంభంలోనే ఏపీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గరిష్టంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 34 డిగ్రీలకు వరకు నమోదవుతోంది. అయితే రోజురోజు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి.
ఈ వారాంతం వచ్చేసరికి అవి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. రాయలసీమలో ఉదయం ఏడు గంటల నుంచే వేడి మొదలవుతుండగా, రాత్రి 8 గంటలైనా వేడి తగ్గడం లేదు. కడపలో ప్రస్తుతం సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ ఈ నెల 14, 15 తేదీల్లో 42 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.