మేడే సందర్భంగా విజయవాడలో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోండా ఉమ, గద్దె రామ్మోహనం, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ.. మూడేళ్ల జగన్ పాలనలో ఒక కార్మికుడు చనిపోయినా రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. కార్మికులు దాచుకున్న డబ్బులను కూడా జగన్ సర్కార్ తినేసిందని విమర్శించారు. ఏపీలో మళ్లీ రామరాజ్యం రావాలంటే చంద్రబాబును గెలిపించాలని కోరారు.
మరోవైపు మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు ఈ సభే నాంది కావాలన్నారు. వైసీపీ పాలనలో ఇసుకతో అవినీతి మొదలు పెట్టారని.. వైసీపీ నేతల అవినీతితో తాడేపల్లిలోని జగన్ నివాసానికి వేల కోట్లు తరలిపోతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది కార్మికుల పొట్టగొట్టిన చరిత్ర జగన్‌దే అని విమర్శలు చేశారు. అబద్ధపు హామీలతో ఆర్టీసీ కార్మికులను మోసం చేశారన్నారు. ఈ ముఖ్యమంత్రి బొగ్గు తీసుకురాడు, కరెంట్ ఇవ్వడని ఎద్దేవా చేశారు.
అటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏపీలో రోజుకో మానభంగం జరుగుతోందని ఫైర్ అయ్యారు. హోంమంత్రిగా తానేటి వనిత అనర్హురాలు అని.. ఎప్పుడైనా అధికార పార్టీ ఎమ్మెల్యేను కొట్టడం ఎక్కడైనా చూశారా అని.. ఈ ప్రభుత్వ హయాంలోనే అది చూస్తున్నామన్నారు. ఆర్టీసీ ఆస్తులను దోచుకోవటానికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని ఆరోపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం కావటానికి కర్త, కర్మ, క్రియ జగనే అన్నారు. పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చిన దద్దమ్మ సీఎం జగన్ అని ఎద్దేవా చేశారు. ఈ ముఖ్యమంత్రికి కార్మికులను గౌరవించే సంస్కారం లేదన్నారు. కార్మికుల సంపదను కూడా ఈ ముఖ్యమంత్రి దోచుకున్నారన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో ఒక్కో కార్మికుడికి రూ. 5 లక్షలను చంద్రన్న బీమా కింద ఇచ్చామని… కార్మికులు చనిపోతే జగన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారన్నారు. ఆర్టీసీ కార్మికుడిపై భుజంపై చేయ్యేసి.. చంద్రబాబు మోసం చేస్తున్నారని చెప్పిన జగన్.. ఇప్పుడు వారిని నిలువునా మోసం చేశారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని గుర్తుచేశారు. కార్మికులకు.. ఉద్యోగులకు ఈ సీఎం ఏం ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ.18వేల వేతనం ఇచ్చారన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి జీతం కూడా పెంచలేదన్నారు. ప్రతినెలా 15వ తేదీ వచ్చినా కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతం పడటం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో 9.20 లక్షల ఆటోలు ఉంటే కేవలం 1.20 లక్షల మందికి మాత్రమే రూ. 10 వేలు ఇస్తూ మిగతావారిని సీఎం జగన్ మోసం చేస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు.