టీడీపీలో విషాదం నెలకొంది. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు శుక్రవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు గతంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989-94లో నాగూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
కాగా వైసీపీ ఆవిర్భావం తర్వాత శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు ఆ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత ఆయన వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు. కురుపాం ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు స్వయానా మావయ్య అవుతారు. అంతేకాకుండా మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు సోదరుడు కూడా.
కాగా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. శత్రుచర్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు నారా లోకేష్ పేర్కొన్నారు.