Hindupuram MLA Balakrishna: హిందూపురం నియోజకవర్గం లేపాక్షిలో బుధవారం నాడు టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. గోరంట్ల మాధవ్ సభ్యసమాజం తలదించుకునే పనిచేశారని.. ఆయన సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి.. ఏం మొహం పెట్టుకుని జెండా ఆవిష్కరణకు వచ్చారని ప్రశ్నించారు . టీడీపీ కార్యకర్తలు ఆయన్ను అడ్డుకుంటే పోలీసులు అరెస్ట్ చేశారని.. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని బాలయ్య వ్యాఖ్యానించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని. వాళ్లు సరైన టైంలో గుణపాఠం చెబుతారని బాలయ్య అన్నారు.
Read Also: Bharat Jodo Yatra: ఏపీలో రాహుల్ గాంధీ పాదయాత్ర.. కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వచ్చేనా?
మరోవైపు ఏపీలో మంత్రులకు ఎవరెవరికి ఏఏ అధికారాలు ఉన్నాయో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే బాలకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది మంత్రులు కాన్వాయ్‌లలో తిరుగుతూ షోలు చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లకు డీజిల్ కూడా దండగే అంటూ బాలయ్య ఫైరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసి కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అయ్యారని వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. 25మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారని.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదంటూ ఎద్దేవా చేశారు. సంక్షేమం ఊదరగొడుతున్నామంటూ ప్రచారం చేసుకుంటూ వాస్తవ పరిస్థితిలో సంక్షేమ పథకాలను కట్ చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క ఛాన్స్ ఇస్తే చెత్తపై కూడా పన్ను వేశారని వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం పన్నులను పెంచి మధ్యతరగతి ప్రజలను కష్టాల పాలు చేస్తోందని బాలకృష్ణ విమర్శలు చేశారు.