రాష్ట్రంలో వైసీపీ నేతల దాడులు దారుణంగా వున్నాయని మండిపడ్డారు టీడీపీ నేతలు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల పై దాడులా? ఇదెక్కడి అన్యాయం..ముఖ్యమంత్రి గారూ ఒక్కసారి ఆలోచించండి అన్నారు టీడీపీ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ప్రజా సమస్యల దృష్టి మరల్చడానికే ఈ చర్యలా.. !? అని గంటా ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.
ప్రతిపక్ష పార్టీ నేతల కార్యాలయాలు, ఇళ్లపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు దాడి చేయడం అమానుషమైన చర్య కాదా? పట్టాభి మీడియా సమావేశం పై మీకు అభ్యంతరాలు ఉండొచ్చు, తప్పేమీ కాదు, కానీ దానికి అనుసరించాల్సిన విధానాలు ఖచ్చితంగా ఇవి మాత్రం కాదని నేను స్పష్టంగా చెప్పదలచుకున్నాను.
రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సింది మీరే, అలాంటిది మీరే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరికి చెప్పాలి? ఆ మాత్రం కనీస మర్యాదలు పాటించకపోతే ఎలా అన్నారు. టీడీపీ కార్యాలయాల మీద దాడి చేయమని సలహా ఇచ్చిన వారికి తెలీదా? నిజంగా మీరు డ్రగ్స్ వ్యాపారాలు చేయకపోతే, గంజా స్మగ్లింగ్ నిర్ములనకు చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష నేతల విమర్శలు ఖండించండి. రాజకీయ విమర్శలను ఎదుర్కోవడం నాయకుడి సహజ లక్షణం కావాలి. కానీ ఇలా ఫ్యాక్షనిజం ని గుర్తు చేసేలా సంఘటనలు చోటు చేసుకోవడం బాధగా ఉందన్నారు. ఇప్పటికైనా మీరు జోక్యం చేసుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తారని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు గంటా శ్రీనివాసరావు.
మరో వైపు ..పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి. టీడీపీ ఆఫీస్ ల పై వైసీపీ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని గౌరు చరిత రెడ్డి తీవ్రంగా విమర్శించారు. టీడీపీ నేత పట్టాభిపై దాడిని నంద్యాల పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు గౌరు వెంకట రెడ్డి ఖండించారు. పాణ్యం నగరంలో మాధవినగర్లో స్వగృహం నందు క్యాండిల్ లతో నిరసన వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే దాడులు చేయడం సరైందని కాదని గౌరు చరిత రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి గారు,గొర్రెల పెంపకం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వర యాదవ్ గారు,ప్రభాకర్ యాదవ్,మహేష్ గౌడ్,రవి రెడ్డి,కేతురు మధు,బజారన్న సుల్తాన్,తదితరులు పాల్గొన్నారు.