ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిపోయింది. ఒకరిపై మరొకరు తీవ్రంగా దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా టీడీపీ నేత కూన రవికుమార్.. స్పీకర్ తమ్మినేని సీతారాంపై ధ్వజమెత్తారు. ఆయన పిచ్చోడైపోయాడని, నియోజకవర్గంలో ఒక్క పని కూడా చేయలేకపోయారని విమర్శించారు. స్పీకర్‌గా ఉంటూ, రాజకీయాల మీద బెట్టింగ్‌లు కడతానంటున్న ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రవికుమార్ ప్రశ్నించారు. ఉద్యోగాలిస్తానని ప్రజల దగ్గర నుంచి డబ్బులు దండుకున్నారని, అందుకే మీకు ఓట్లు వేయాలా? అంటూ నిలదీశారు.
సీతారాంని ఓడించడానికి కూన రవికుమార్ కూడా అవసరం లేదని, టీడీపీ టికెట్‌పై ఎవరు పోటీ చేసినా, ఆయన 25 వేల ఓట్లతో ఓడిపోతారని అన్నారు. అసలు సీతారం పోటీకే పనికిరారని సాధారణ కార్యకర్త సైతం కామెంట్స్ చేస్తున్నారని, కేవలం ఎమ్మెల్యే సీటు కోసమే ఆయన ఈ హడావుడి చేస్తున్నాడని చెప్పారు. డమాబుస్సుల సీతారాం.. ఉత్తర కుమార ప్రగల్భాలు కట్టి పెట్టాలని మండిపడ్డారు. జే బ్రాండ్‌లను సీతారాం తాగడం మానేస్తే మంచి బుద్ధులొస్తాయని హితవు పలికారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీతారాం అక్రమ సంపాదనపై విచారణ చేపడతామని హామీ ఇచ్చారు.
ఇక సీఎం జగన్ హోదా పేరుతో ప్రజల్ని దారుణంగా మోసం చేశారని, నవరత్నాలంటూ ప్రజలు నవరంధ్రాల ద్వారా డబ్బులు లాక్కున్నారని రవికుమార్ ఆగ్రహించారు. గడపగడపకు కార్యక్రమం చేపట్టిన వైసీపీ నేతలు.. ప్రజల్లోకి వెళ్లలేని నిస్సాహాయ పరిస్థితిలో ఉన్నారన్నారు. తాము ఏం చేశామో చెప్పలేక పోతున్నారని, అందుకే వైసీపీ కండువాతో జనాల్లోకి వెళ్ళాలంటే వణికిపోతున్నారన్నారు. గడపగడపకు వెళ్తే.. వైసీపీ నేతలకు చీవాట్లు తప్ప, సత్కారాలేమీ లేవని కూన రవికుమార్ ఎద్దేవా చేశారు.