గుడివాడ క్యాసినో అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. నిన్న టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్ లో తనిఖీలు చేసేందుకు వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి పరిస్థితుల దృష్ట్యా టీడీపీ నిజ నిర్ధారణకమిటీ సభ్యులు వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే తాజాగా టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు బోండా ఉమా మాట్లాడుతూ.. విజయవాడ కలెక్టర్ కు గుడివాడ క్యాసినో, తనిఖీ వెళ్లిన తమపై దాడి చేశారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అంతేకాకుండా గుడివాడకు తనిఖీ కోసం వెళ్లిన తమపై మంత్రి కొడాలి నాని గుండాలు దాడి చేశారని ఆరోపించారు. కొడాలి నాని నిన్న చేసిన సవాల్ ను అందరూ చూశారని, మళ్లీ ఈ రోజు సవాల్ కు వస్తే నిలబడలేక పోయారని ఎద్దేవా చేశారు. కొడాలి నాని నువ్వు ఓకే గ్రామసింహానివి, కొడాలి నాని బూతులు మాట్లాడడానికి తప్ప దేనికి పనికిరాడు అంటూ తీవ్రంగా విమర్శించారు. నీ కన్వెన్షన్ లో జరిగిన క్యాసినోపై నీ దగ్గర ఉన్న పోలీసులతోనే నువ్వే ఓ కమిటీ వేసి నిజాలు బయటపెట్టాలన్నారు.