ఏపీలో కొత్త జిల్లాల విభజనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే, నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపణలు చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికో న్యాయం, జిల్లా కేంద్రాల ఏర్పాటుకు మరో న్యాయాన్ని వైసీపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందని ఆయన విమర్శించారు. అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న అమరావతి రాజధానిగా పనికిరాదంటున్న ప్రభుత్వం… జిల్లా కేంద్రాలను మాత్రం సమదూరంలో ఉండాలనే వాదనను ఎలా తీసుకొస్తుందని నిలదీశారు.
Read Also: అదొక్కటే జగన్ చేసిన మంచి పని: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల
రాష్ట్ర రాజధాని విషయంలో అన్ని ప్రాంతాలకు దూరంగా ఉన్న విశాఖను రాజధానిగా చేస్తామని చెప్తున్న వైసీపీ నేతలు జిల్లా రాజధానుల విషయంలో ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. డైవర్షన్ రాజకీయాలకు వైసీపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందన్నారు. శాస్త్రీయ పద్ధతి లేకుండా వైసీపీ నేతలు స్వార్థ ప్రయోజనాలను చూసుకుని జిల్లాలను విభజించారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. గుడివాడలో క్యాసినో భాగోతాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. ఉద్యోగుల సమస్యలు, క్యాసినో వ్యవహారం నుంచి పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాలను తెరపైకి తెచ్చి ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని జీవీ ఆంజనేయులు విమర్శలు చేశారు. జనగణన పూర్తయ్యే వరకూ కొత్త జిల్లాల ఏర్పాటు వద్దు అని కేంద్రం స్పష్టం చేసినా ఇష్టానుసారంగా జిల్లాల విభజన చేశారన్నారు. జిల్లా పేర్లు పెట్టడంలోనూ రాజకీయ స్వార్థం చూసుకున్నారన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన జగన్, జిల్లాల అభివృద్ధికి నిధులు ఏ విధంగా సమకూర్చుతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.