Chandrababu: టీడీపీలో వివిధ పార్టీల నుంచి చేరికలు జరుగుతున్నాయి. చంద్రబాబు సమక్షంలో పలు నియోజకవర్గాలకు సంబంధించిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. పెదకూరపాడు, తణుకు, అమలాపురం నియోజకవర్గాల నుంచి వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. పెదకూరపాడు ఎమ్మెల్యే ఇసుక మాఫియాగా మారారని.. పెదకూరపాడు ఎమ్మెల్యే ఇసుక విషయంలో సీఎం జగన్‌కు బినామీ అని చంద్రబాబు ఆరోపించారు. అరాచకం చేస్తోన్న సీఎం జగన్ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. జగన్ సినిమా అయిపోయిందని.. పరిస్థితి అర్థమయ్యే 92 మంది ఎమ్మెల్యేలను మారుస్తున్నారన్నారు. ఒక్క ఛాన్స్ ప్రజల పాలిట శాపంగా మారింది.. అందరూ గోవిందా గోవిందా అనుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఆక్వా రైతు టీడీపీ హయాంలో రొయ్య మాదిరి మీసం మేలేసేవాడు.. కానీ ఇప్పుడు కుదేలేయ్యాడన్నారు.
Read Also: CM YS Jagan: ఇడుపులపాయలో పులివెందుల నేతలతో సీఎం జగన్ భేటీ
ప్రజల కోసం సుదర్శన నారసింహ యాగం, చండీ హోమం చేశానని చంద్రబాబు స్పష్టం చేశారు. నా కోసం యాగాలు చేయలేదన్నారు. తనకేం పదవులు అవసరం లేదన్న చంద్రబాబు.. తనకు రికార్డును ఎవ్వరూ బద్దలు కొట్టలేడన్నారు. ప్రజల ఆశీస్సులు వల్ల తనకు గౌరవం లభించిందన్నారు. తెలుగు జాతికి గౌరవం తెచ్చేలా వ్యవహరించానే తప్ప.. అపఖ్యాతి తీసుకు రాలేదన్నారు. మన తల రాతలు మార్చుకునే శక్తి మన చేతుల్లోనే ఉందన్నారు. విశాఖ గాదిరాజు ప్యాలెస్సుపై సీఎం జగన్ కన్ను పడిందని ఆయన విమర్శించారు. గాదిరాజు ప్యాలెస్ అడిగితే ఇవ్వలేదని.. ఆ ప్యాలెస్ ఉన్న భూమిని 22A జాబితాలో కలిపేశారని ఆయన ఆరోపణలు చేశారు. విశాఖలో రూ. 40 వేల కోట్ల ఆస్తులను.. భూములను కబ్జా చేశారని.. వైసీపీ ప్రభుత్వ బెదిరింపులతో ఏపీ వదిలిపోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఏపీలో ఉండాలంటే బానిసలుగా ఉండాలి.. లేకుంటే పోవాలనే రీతిలో సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మద్యనిషేధం చేస్తా.. లేకుంటే ఓట్లనడగనన్నారని.. ఇప్పుడు మాట మార్చాడంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ..”వచ్చే ఎన్నికలు వైసీపీ – టీడీపీ, జనసేన మధ్య జరిగే ఎన్నికలు కావు. వచ్చే ఎన్నికలు వైసీపీకి ప్రజలకు మధ్య జరిగేవి. నా కోరికంతా తెలుగు జాతి నెంబర్-1గా ఉండాలనే. తెలంగాణలో ప్రభుత్వాలు మారినా అభివృద్ధిని ఆపలేదు. ఏపీలో అమరావతిని ఏం చేశారో చూస్తూనే ఉన్నాం. విశాఖకు రాజధాని తరలింపుపై హైకోర్టు మొట్టి కాయలు వేసింది. అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు.. ఏదేదో మాట్లాడుతుంది. ఈ ప్రభుత్వ అడ్డగోలు విధానాలపై అన్ని వర్గాల వారు ఆలోచించాలి. ఉచిత బస్సు ప్రయాణం హామీని తానూ అమలు చేస్తానంటున్నారు సీఎం జగన్. ధరలు పెంచేశారు.. ఛార్జీలు పెంచేశారు.. ఈ డబ్బులు జగన్ తిరిగిస్తారా..?. పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావును మారుస్తాడట.. శంకర్రావును మారిస్తే లాభమేంటీ. ?. మార్చాల్సింది సీఎం జగన్ను. ఈసారి వైసీపీని చిత్తుగా చిత్తుగా ఓడించాలి. రాష్ట్ర భవిష్యత్ కోసం ఒక మెట్టు దిగి ముందుకు పోతాం.. పార్టీ నేతలు కూడా అదే ఆలోచించాలి.” అని చంద్రబాబు అన్నారు.