గ్రామాల్లో కరెంట్ పీకుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను.. సీఎం పదవి నుంచి పీకేందుకు జనం సిద్ధంగా ఉన్నారంటూ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తెలుగుదేశం పిలుపునిచ్చిన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.. బాదుడే బాదుడు ఆందోళనల్లో భాగంగా త్వరలో క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేపట్టబోతున్నారు చంద్రబాబు, లోకేష్.. క్షేత్రస్థాయికి వెళ్లని నేతలను మార్చేందుకు కూడా వెనుకాడేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసిన చంద్రబాబు.. ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని కార్యక్రమంపై జరిపిన సమీక్షలో వ్యాఖ్యానించారు.
Read Also: Srinivas Goud: డ్రగ్స్ దందా చేయాలనుకుంటే దేశం వీడండి.. పబ్స్ లేకుండా చేస్తాం..!
బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రతి ఇంచార్జ్ సీరియస్గా తీసుకోవాలి.. ఎవరికీ మినహాయింపులు లేవన్నారు చంద్రబాబు నాయుడు.. విద్యుత్ కోతలు, పెరిగిన కరెంట్ ఛార్జీలపై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న ఆయన.. పరిశ్రమలకు విద్యుత్ కోతలతో కార్మికుల ఉపాధి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. పంటలకు నీరందక రైతులు మరింత సంక్షోభంలోకి వెళ్లిపోతారన్నారు.. ఇక, గ్రామాల్లో కరెంట్ పీకుతున్న జగన్ను.. సీఎం పదవి నుంచి పీకేందుకు జనం సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు.. కాగా, ఆంధ్రప్రదేశ్లో కరెంట్ కోతలు కొనసాగుతున్నాయి.. పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించాల్సిన పరిస్థితి కూడా వచ్చిన విషయం తెలిసిందే.. ప్రభుత్వ చేతగాని తనం వల్లే.. ఈ పరిస్థితి వచ్చిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే.. గత ప్రభుత్వం చేసిన పాపాలవల్లే ఈ పరిస్థితి వచ్చిందని అధికార వైసీపీ మండిపడుతోంది.