కొన్నిరోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. తాజాగా ఆయన కడప జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. సీఎం జగన్‌కు కంచుకోటగా చెప్పుకునే కడపలో టీడీపీ నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శల వర్షం కురిపించారు. నియంత పాలన సాగిస్తున్న జగన్‌ను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం కనిపిస్తోందన్నారు. మూడేళ్లలోనే ఏపీని జగన్ సర్వనాశనం చేశారని చంద్రబాబు ఆరోపించారు.
Actor Ali: రాజ్యసభ సీటు ఆశించలేదు.. కానీ జగన్ దృష్టిలో నేనున్నాను
అటు వైసీపీ రాజ్యసభ సభ్యుల ఎంపికపైనా చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో రాజ్యసభలో రాణించే సత్తా కలిగిన వారు లేనట్టు, నాయకులే లేనట్లు, వెనుకబడిన వర్గాల నేతలు లేనట్లు.. పక్క రాష్ట్రానికి చెందిన వారిని జగన్ ఎంపిక చేశారని ఎద్దేవా చేశారు. ఏపీలో రాజ్యసభకు అర్హులైన వారే లేరా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. తనను ప్రశ్నించే వారే లేరన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కనీసం రోడ్లకు మరమ్మతులు చేసే స్థితిలో కూడా ప్రభుత్వం లేదన్నారు. కరెంట్ ఛార్జీలను అడ్డగోలుగా పెంచి జనాల నడ్డివిరిచారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో శ్రీలంక లాంటి పరిస్థితులే ఉన్నాయని.. రాజపక్సేకు పట్టిన గతే జగన్‌కు పట్టబోతుందని ఆయన జోస్యం చెప్పారు.