ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే మాటలు ఇవ్వేనా అని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మొద్దబ్బాయిల్లా మారతారని తమకు ఇప్పటివరకూ తెలియదన్నారు. అలా కూడా ఆలోచించవచ్చా అని ప్రతిపక్షనేత చెప్పే వరకు తనకు తెలియదని ఎద్దేవా చేశారు. పేదవాళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా అని నిలదీశారు. కేవలం తన కుమారుడు మాత్రమే ఇంగ్లీష్ చదివితే చాలు అని చంద్రబాబు భావిస్తు్న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా సమయంలో టీడీపీ నేతలు ఎక్కడున్నారో వాళ్లకే తెలియదని.. ఇప్పుడేదో ప్రజలను ఉద్ధరించేటట్లు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని హోంమంత్రి తానేటి వనిత ఆరోపించారు. గత మూడేళ్లుగా జగన్ పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వడం కోసమే తాము ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని ఆమె వివరించారు. సీఎం జగన్‌ను పిల్లలందరూ మేనమామగా భావిస్తున్నారని తానేటి వనిత పేర్కొన్నారు.