దేశ రాజధాని ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో జరిగిన సమావేశంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఆగస్టు నెలలో కెనడాలో జరిగే అంతర్జాతీయ స్పీకర్ల సదస్సుకు సంబంధించి శుక్రవారం నాడు లోక్సభ స్పీకర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అసెంబ్లీ స్పీకర్లు, మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. సభ్యుల ప్రవర్తనపై ఎప్పుడూ ఉండే విధానం ఉంటుందని.. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం కఠినంగా నిర్ణయం తీసుకోవాలని తాము గతంలోనే లోక్సభ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు.
Read Also: Andhra Pradesh: ఆటో నడిపిన సీఎం జగన్.. ఫోటోలు
నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని.. వారిపై చర్యలు ఎలా తీసుకుంటామని ప్రశ్నించారు. వారు ఇంకా టీడీపీలోనే ఉన్నారు కదా అని స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు. అసెంబ్లీలో కానీ, పార్లమెంట్ లోపల కానీ ప్లకార్డుల ప్రదర్శన మంచిది కాదని ఆయన సూచించారు. అసెంబ్లీ ఎమ్మెల్యేల హక్కు అవొచ్చు కానీ ఏది పడితే అది చేస్తే ఊరుకోబోమన్నారు. సభ్యులుగా ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే రికార్డుల నుంచి తొలగిస్తామని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. సభ్యులు సభలో మర్యాదగా వ్యవహరించాలన్న విషయం తెలుసుకోవాలన్నారు. శాసన సభ్యులు చిన్న పిల్లలు కాదని.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అని గ్రహించాలన్నారు. టీవీ ఛానళ్లలో ప్రసారాల వల్ల సభలో కొంతమంది సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు.