సీపీసీని అమలు చేస్తున్నారా..? అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను అమలు చేస్తున్నారా..? ఆఫీసర్స్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తున్నారా..? ఏపీలో అమలు చేయాలనుకుంటోంది ఏ పీఆర్సీ అని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. దేన్ని అమలు చేస్తున్నారో చెబితే మేం చర్చలకు సిద్దమని ఆయన స్పష్టం చేశారు. సీపీసీని అమలు చేస్తే.. అందులో ఉన్న మిగిలిన అంశాలనూ అమలు చేస్తారా..? అని ఆయన అన్నారు. ప్రభుత్వ కమిటీ మీద గౌరవం ఉంది కాబట్టే.. దారిన పోయే దానయ్యలను కాకుండా స్టీరింగ్ కమిటీ సభ్యులను ఎంపిక చేసి పంపామన్నారు. ప్రభుత్వమే దారిన పోయే దానయ్యలతో చర్చిస్తామంటోందని ఆయన మండిపడ్డారు.
జీతాల్లో కోత లేకుంటే రికవరీ చేయాలని జీవోలో ఎందుకు పేర్కొన్నారో మెచ్యూర్టీ ఉన్న ప్రభుత్వ కమిటీ సభ్యులే చెప్పాలన్నారు. ప్రతి డిపార్ట్మెంటుకూ ప్రత్యేకంగా పే ఫిక్స్ చేస్తూ గతంలో జీవోలు ఇచ్చేవారు.. ఇప్పుడు ఆ విధానానికి చెల్లు చిటీ చెప్పేశారా..? అని ఆయన వ్యాఖ్యానించారు. మెచ్యూర్టీ లేదంటూ చేసిన వ్యాఖ్యలు ఉద్యోగ సంఘాలను అవమాన పర్చడమేనని ఆయన అన్నారు. ఉద్యోగి అనుమతి లేకుండా కొత్త పే స్కేల్ అమలు చేయకూడదన్న సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి కొత్త పేస్కేల్ అమలు వద్దంటూ రాత పూర్వకంగా ఇస్తున్నామన్నారు.