Supreme Court: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న గంగిరెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంపై తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.. గంగిరెడ్డికి మంజూరైన బెయిల్ రద్దు అంశంపై విచారణను హైకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.. ఈ కేసులో గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరపాలని సూచించింది దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసిన నేపథ్యంలో.. బెయిల్ రద్దు అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టులో తేల్చాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు..
Read Also: Pet Dog Tax: మీరు కుక్కలు పెంచుతున్నారా..? అయితే ఈ పన్నులు కట్టాల్సిందే..!
అయితే, వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టులో ఇప్పటికే వాదనలు, విచారణ ముగియగా.. ఇవాళ తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు.. ప్రస్తుతం ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌పై ఉన్నారు.. అయితే, వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.. ఎర్ర గంగిరెడ్డి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదిస్తూ వచ్చింది.. 2019 మార్చి 15వ తేదీన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయం విదితమే.. ఇప్పటికే వైఎస్ వివేకా హత్య కేసును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు.. ఇప్పుడు గంగారెడ్డి బెయిల్ రద్దు వ్యవహారాన్ని కూడా టీఎస్ హైకోర్టుకు బదిలీ చేసింది.