Srisailam Dam: ఇటీవల వరదలతో పోటెత్తిన కృష్ణమ్మ శాంతించింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లను మంగళవారం నాడు అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్ నుంచి 1.21 లక్షల క్యూసెక్కులు, సుంకేశుల జలాశయం నుంచి 21,725 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. అటు శ్రీశైలం కుడి, ఎడమ గట్ల జల విద్యుత్ కేంద్రాల నుంచి 64,243 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు అధికారులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి 884.4 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 212.4385 టీఎంసీలుగా నమోదైంది.
Read Also: Tomato Flu: టొమాటో ఫ్లూ వ్యాధిపై రాష్ట్రాలకు సూచనలు చేసిన కేంద్రం
అటు పల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు గేట్లను కూడా అధికారులు మూసివేశారు. పులిచింతల ఇన్ ఫ్లో 27, 127 క్యూసెక్కులుగా, అవుట్ ఫ్లో 10, 112 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలుగా నమోదైంది. ప్రస్తుత నీటినిల్వ 39.69 టీఎంసీలుగా కొనసాగుతోంది. శ్రీశైలం రిజర్వాయర్‌కు ఎగువన ఉన్న సుంకేసుల ప్రాజెక్టుకు మాత్రం వరద నీరు కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 23,990 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 21,750 క్యూసెక్కులుగా నమోదైంది. 5 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సుంకేసుల డ్యాం పూర్తి సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.068 టీఎంసీల నీటి నిల్వ ఉంది.