PM Modi Puttaparthi visit: సత్య సాయి శత జయంతి వేడుకలకు పుట్టపర్తి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చాలా రోజుల తర్వాత ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి కలకలలాడుతోంది. పుట్టపర్తిలో ఇంతటి జనసందోహం కనిపించడం బాబా నిర్యాణం తర్వాత ఇదే మొదటిసారి. ప్రపంచ వ్యాప్తంగా సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భగవంతుడిగా పూజలందుకునే సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భారీ స్థాయిలో ఈ వేడుకలు నిర్వహించాలని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భావించింది. ఇందుకోసం నెల రోజుల ముందు నుంచి ఏర్పాట్లు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సెంట్రల్ ట్రస్ట్‌తో అనుసంధానం చేసుకునేలా ప్రత్యేకంగా మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఏడాది కాలంగా బాబా జయంతి ఉత్సవాలకు ప్లాన్ చేశారు. ఇప్పటికే బాబా శత జయంతి వేడుకలకు దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులతో పుట్టపర్తిలో కోలాహలం నెలకొంది. దేశవిదేశీ భక్తులు 220కిపైగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు వసతి, భోజనం, దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేశారు. సాయి భక్తులు స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే శాఖ 160 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది.
సత్యసాయి శత జయంతి వేడుకల్లో రాష్ట్రపతి, ప్రధాని మొదలుకొని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సహా అంతా తరలివస్తున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ, 22న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరుకానున్నారు. కాసేపట్లో ప్రధాని మోడీ… సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని, హిల్ వ్యూ స్టేడియంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొంటారు. ప్రధాని పర్యటనకు భద్రతను కట్టుదిట్టం చేశారు. మోడీ చేతుల మీదుగా సత్యసాయి శత జయంతి స్మారక చిహ్నంగా వంద రూపాయల నాణెం, నాలుగు పోస్టల్ స్టాంపులను ఆవిష్కరిస్తున్నామని ట్రస్టు సభ్యులు తెలిపారు. అటు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పుట్టపర్తి చేరుకున్నారు. కాసేపట్లో ప్రధానికి గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం స్వాగతం పలుకుతారు. ఈనెల 23న ఉత్సవాలు ముగిసేదాకా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ శాఖలతో శ్రీ సత్యసాయి ట్రస్టు సమన్వం చేసుకుంటోంది.
Read Also: Astrology: నవంబర్ 19, బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..!
సత్య సాయి జయంతి వేడుకల్లో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొనేందుకు పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి రానున్నారు ప్రధాని మోడీ.. ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలకనున్నారు.. సత్యసాయి జయంతి వేడుకలు సందర్భంగా ప్రశాంతి నిలయానికి భారీగా పోటెత్తారు భక్తులు. హిల్ వ్యూ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొనేందుకు తరలివచ్చారు.. సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను పురస్కరించుకొని వంద కాయిన్, స్టాంపులను విడుదల చేయనున్నారు ప్రధాని మోడీ.. ఇక, ప్రధాని రాక సందర్భంగా పుట్టపర్తి పట్టణంలో పట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. అడుగడుగునా మూడు అంచెల పోలీసు భద్రతలోకి పుట్టపర్తి వెళ్లిపోయింది.. ఇక, రాత్రి పుట్టపర్తి చేరుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్..
* ఉదయం 9.45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్న ప్రధాని మోడీ.
* ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గంలో ప్రశాంతి నిలయానికి వెళ్లనున్న ప్రధాని.
* సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించనున్న మోడీ..
* ఉదయం 10.30 గంటలకు హిల్‌వ్యూ స్టేడియంలో ప్రపంచ మహిళా దినోత్సవం.
* రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలు ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ