CM Chandrababu: అభివృద్ధి – సంక్షేమమే లక్ష్యం, ఫేక్ రాజకీయాలకు చెక్ పెడతామని కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, విపత్తుల నిర్వహణ, రాయలసీమ ప్రగతిపై అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. పారదర్శక పాలన, పెట్టుబడుల ఆకర్షణ ద్వారా రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇక, ఇంటి వద్దకే పింఛన్, చరిత్రలో నిలిచే DBTగా పేర్కొన్నారు.. అభివృద్ధి చేస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వగలమని తెలిపారు.
ఇక, నేను కూడా బటన్ నొక్కచ్చు, పరదాలు కట్టుకుని ఉండొచ్చు. కానీ, ప్రజలతోనే ఉండాలి, ప్రజలకు నేరుగా సేవలందించాలనుకున్నాం.. అందుకే మీ ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నాం అని తెలిపారు సీఎం చంద్రబాబు.. పింఛన్ల పంపిణీ కోసం ప్రతీ ఏడాది 33 వేల కోట్లు రూయలు ఖర్చు చేస్తున్నామని, దేశంలో మరే రాష్ట్రం ఇంత ఖర్చు పెట్టడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు రూ.57,764 కోట్లు పింఛన్లు ఇచ్చామని, ఇది దేశంలోనే అతిపెద్ద డీబీటీ (Direct Benefit Transfer) కార్యక్రమమని పేర్కొన్నారు. “నేను ఈ కార్యక్రమాన్నైనా వాయిదా వేస్తాను.. కానీ, పింఛన్ల పంపిణీలో కచ్చితంగా పాల్గొంటాను అని వెల్లడించారు..
మరోవైపు, మొంథా తుఫాన్‌పై స్పందించిన సీఎం చంద్రబాబు.. టెక్నాలజీతో నష్ట నివారణ చర్యలు తీసుకున్నామన్నారు.. తుఫాను వల్ల జరిగిన విధ్వంసాన్ని, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను సీఎం వివరించారు. తుఫాను ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినప్పటికీ, ఎక్కడికక్కడ టెక్నాలజీ వినియోగించి, ప్రజలు ఇబ్బంది పడకుండా సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. నష్టపోయిన రైతాంగం 5 రోజుల్లో కోలుకునేలా చేశామన్నారు. తుఫాను వల్ల రూ.5250 కోట్ల ఆస్తి నష్టం, ఇద్దరు ప్రాణనష్టం జరిగిందని, దీనిపై కేంద్రం సాయం కోరామని చెప్పారు. ఇక, రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పెట్టుబడుల విషయంలో స్పష్టమైన ప్రణాళిక ఉందని సీఎం ప్రకటించారు. కియా పరిశ్రమ కోసం యుద్ధ ప్రాతిపదికన హంద్రీనీవా నీరు తీసుకొచ్చామని, ప్రస్తుతం కరవు జిల్లాలోనే కార్లు తయారవుతున్నాయని గుర్తుచేశారు. హంద్రీనీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నామని, అనంతపురం జిల్లాలో ప్రతి చెరువుకు, ఎకరానికి నీరు ఇచ్చే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. ‘నాది కూడా రాయలసీమ’ అని చెప్పుకునే వారు సొంత నియోజకవర్గం పులివెందులకు కూడా నీరు ఇవ్వలేదని, యూరేనియం ప్లాంట్ తీసుకొచ్చి అలజడులు సృష్టించారని పరోక్షంగా వైఎస్ జగన్‌ను విమర్శించారు ముఖ్యమంత్రి నారా చాంద్రబాబు నాయుడు..
ఏపీకి పెట్టుబడులపై స్పందించిన సీఎం చంద్రబాబు.. గడిచిన 15 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అని తెలిపారు.. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే ఇండస్ట్రియల్ సమ్మిట్‌లో మరో రూ.4-5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా రానున్న రోజుల్లో అగ్రగామిగా నిలుస్తుంది. తిరుపతి దగ్గర స్పేస్ సిటీ, ఓర్వకల్లో డ్రోన్ సిటీ తీసుకొస్తాం అని వివరించారు.. మరోవైపు ఫేక్ రాజకీయాలు, వివేకా కేసుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.. ప్రభుత్వం మంచి చేస్తుంటే ఒక ‘ఫేక్ పార్టీ’ దుష్ప్రచారం చేస్తోందని సీఎం విమర్శించారు. వైసీపీ అనేది ఒక ‘ఫేక్ పార్టీ’ అని, వారు వివేకానంద రెడ్డిని చంపి తనపై నిందలు వేయాలని చూశారని ఆరోపించారు. మొదట గుండె పోటు అన్నారు, కానీ పోస్టుమార్టంలో నెత్తిపై గొడ్డలితో నరికారని తేలిందని, ఆ రోజు ఒక సీఐతో గదిలోని రక్తాన్ని కడిగించారని తెలిపారు.. రౌడీలను, ముఠాలను పూర్తిగా తరిమికొట్టాం. ఇలాంటి సలహాలు ఇవ్వకుండా విష ప్రచారం చేస్తున్నారు. మనం ప్రజలకు మంచి చేస్తుంటే.. ఫేక్ పార్టీ దుష్ప్రచారం చేస్తోంది అని మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు..