Brinda Karat: ఎన్డీఏపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు సీపీఎం సీనియర్ నేత బృందాకారత్.. నెల్లూరులో సీపీఎం రాష్ట్ర మహాసభల ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. నెల్లూరు నుంచి పుచ్చలపల్లి సుందరయ్య పార్టీ కోసం పని చేశారు.. పార్టీ కోసం ఎంతో కష్ట పడిన సీతారాం ఏచూరిని కోల్పోయాం.. నెల్లూరులో పార్టీకి చెందిన వైద్యులు ఏర్పాటు చేసిన ఆసుపత్రి కి వచ్చాను.. నెల్లూరులో ఎన్నో పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు.. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది.. కేంద్ర బడ్జెట్ ప్రజల సమస్యల గురించి పట్టించుకోలేదన్నారు.. దేశంలో ప్రజల పరిస్థితులు ఏ విధంగా దిగజారుతున్నాయో ఆర్థిక సర్వే చెబుతోంది.. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.. రైతులు పండించే ఉత్పత్తులకు కనీస మద్దతు ధర రావడం లేదు.. ఇందుకోసం పోరాడుతున్నా నిధులు కేటాయించలేదని దుయ్యబట్టారు.
పేద ప్రజలకు ఉపయోగపడే ఉపాధి పథకానికి అధికంగా నిధులు ఇవ్వలేదు.. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి నిధులను తగ్గించారు.. ధనికులకు అనుకూలంగా ఉన్న ఈ బడ్జెట్ కు వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు బృందాకారత్.. అసలు చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారు? అంటూ ఏపీ సీఎంపై ఫైర్ అయ్యారు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఏమి ప్రశ్నిస్తున్నారు? అని నిలదీశారు.. మరోవైపు.. రాష్ట్ర మహాసభల్లో ఎంతో కీలక తీర్మానాలను ఆమోదించారు.. ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు బృందాకారత్..
మరోవైపు.. గత మహాసభ నుండి ఈ మహాసభ మధ్య కాలంలో ప్రజా సమస్యలపై జరిగిన ఉద్యమాలు, పోరాటాలను వచ్చే మూడేళ్లలో మరింత పటిష్టంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తిరిగి ఎన్నికైన వి. శ్రీనివాసరావు.. పోలవరం నిర్వాసితులకు పరిహారం కోసం, ఏజెన్సీలో జీవో నెం.3 పునరుద్ధరణ కోసం, భాషా వలంటీర్ల సమస్యపై ఆందోళనలు జరిగాయని, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఫార్మా కంపెనీల్లో ప్రమాదాల్లో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు, ఎన్‌టిఆర్ జిల్లా జగ్గయ్యపేట సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్‌పేలి కొంతమంది మృతిచెందిన ఘటనలో గరిష్టస్థాయిలో పరిహారం ఇప్పించేలా కృషి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వివిధ సమస్యలపై వివిధ జిల్లాల్లో పాదయాత్రలు చేయడం మంచిదేనని, అయితే అనంతపురం జిల్లా మాదిరిగా ఒక దాని వెంట మరోటి నిర్వహించేలా ప్రణాళికలు ఎక్కడికక్కడ రూపొందించుకోవాలని, రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు సహా వివిధ మౌలిక సదుపాయాల కోసం స్థానిక నాయకత్వం చొరవ పెంచుకోవాలని సూచించారు. వరద సహాయ కార్యక్రమాల్లో విజయవాడ, గుంటూరు, కర్నూలు వంటి జిల్లాల్లో పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొన్నాయని చెప్పారు. అయితే మనం చేసిన ఉద్యమాలు, పోరాటాలు, సేవా కార్యక్రమాలకు తగ్గట్లుగా ప్రజాపునాది పెరగలేదన్నారు వి. శ్రీనివాసరావు..