Somu Veerraju: విశాఖలోని దసపల్లా భూముల అన్యాక్రంతంపై సీఎం జగన్‌కు మంగళవారం నాడు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు లేఖ రాశారు. విశాఖ నగరంలో అన్యాక్రాంతమవుతున్న దసపల్లా భూములను కాపాడి స్వాధీనం చేసుకోవాలని లేఖలో కోరారు. విశాఖపట్నం నగర నడిబొడ్డున ప్రభుత్వ అతిథి గృహాన్ని ఆనుకుని ఉన్న వివాదాస్పద దసపల్లా భూములను కొందరు బిల్డర్లకు అప్పగించటానికి రంగం సిద్ధమైందని.. దీని వెనుక అధికార పార్టీ నాయకులకు, వారి బంధువర్గాలకు ప్రయోజనం చేకూరేలా కోట్లాది రూపాయల కుంభకోణం దాగి ఉందనే ప్రచారం జరుగుతోందని సోము వీర్రాజు ఆరోపించారు. ఈ భూముల విషయమై ఇప్పటికే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినందున తీర్పును అమలు చేస్తున్నామని మంత్రులు, అధికారులు చెపుతున్నారని.. 2016లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయొద్దని.. వందల కోట్ల విలువైన భూములను రక్షించుకోవటానికి ప్రభుత్వం మరోసారి న్యాయపోరాటం చేయాలని, వైసీపీ విపక్షంలో ఉండగా డిమాండ్ చేసిన విషయాన్ని సోము వీర్రాజు గుర్తుచేశారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ భూములను ప్రభుత్వపరం చేయటానికి తగిన చర్యలన్నీ తీసుకుంటుందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పదే పదే చెప్పారని.. ప్రతిపక్ష నేతగా జగన్ కూడా తన పాదయాత్రలో దసపల్లా భూముల అన్యాక్రాంతమైన విషయాన్ని ప్రస్తావించి వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి నాటి సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆనాడు విమర్శించారని సోము వీర్రాజు గుర్తుచేశారు. ప్రతిపక్ష నేతగా నాడు చేసిన డిమాండ్లను విస్మరించి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఈ విధంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. నిషేధిత జాబితా (22 A) నుంచి ఆ భూములను తొలగించి వాటిని అధికార పార్టీకి అనుకూలంగా ఉండే బిల్డర్లకు అప్పగించటానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం తరహాలోనే ఇప్పటి ప్రభుత్వం కూడా అదే స్థాయిలో భూములను పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవడం మానుకోవాలన్నారు.
Read Also: Acid In Water Bottle: వాటర్ బాటిల్లో యాసిడ్.. రెస్టారెంట్ క్లోజ్డ్
ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా ట్యాంపరింగ్ చేసిన.. సృష్టించిన దొంగ పత్రాలకు ఊపిరిచ్చే చర్యల ద్వారా భారీ భూదందాకు తెరలేపిందని సోము వీర్రాజు మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పునః సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి అధికారులతో “స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్‌ను ఏర్పాటు చేసి అవసరమయ్యే న్యాయ ప్రక్రియ ఏ రకంగా తిరిగి జరపాలో విధాన రూపకల్పన చేయాలన్నారు. భూముల పరిరక్షణ కోసం ఆదర్శవంతమైన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు. రూ.1500 కోట్ల పైబడి విలువైన విశాఖపట్నం దసపల్లా హిల్స్ భూముల పరిరక్షణకు వీలుగా ముందుగా స్టే తీసుకువస్తే తర్వాత కొంత కసరత్తు చేసి భూములను రక్షించుకునే అవకాశం కలుగుతుందని సోము వీర్రాజు పేర్కొన్నారు.