Somu Veerraju: ఏపీలో చర్చిల అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఈ సందర్భంగా విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.175 కోట్ల నిధులను చర్చిల నిర్మాణాలకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ ధనాన్ని చర్చిల కోసం ఇవ్వడమేంటని నిలదీశారు. చర్చిల నిర్మాణానికి నిధుల కేటాయింపుపై కోర్టుకెళ్తామని స్పష్టం చేశారు.
రాజధాని నిర్మాణం విషయంలో టీడీపీ – వైసీపీ మిలాఖత్ అయ్యాయని.. రాజధాని నిర్మాణ నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టిస్తే.. దాన్ని ఈ ప్రభుత్వం ప్రశ్నించడం లేదని సోము వీర్రాజు విమర్శలు చేశారు. పొదుపు సంఘాలను స్థాపించింది చంద్రబాబు కాదని.. పీవీ నరసింహారావు అని గుర్తుచేశారు. పొదుపు సంఘాలకు రూ. 20 వేల కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీ తీర్మానం చేశారన్నారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధుల గురించి చెప్పడానికి చంద్రబాబుకు ఎందుకు నోరు రాలేదని సోము వీర్రాజు ప్రశ్నించారు.
Read Also: Gaalodu Review: గాలోడు మూవీ రివ్యూ
ఏపీలో ఇళ్ల నిర్మాణం విషయంలో చాలా జాప్యం జరుగుతోందని.. ఇళ్ల నిర్మాణాల కోసం చేపట్టిన భూ కొనుగోళ్లల్లో అక్రమాలు జరిగాయని సోము వీర్రాజు ఆరోపించారు. ఏపీలో ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం రూ. 35 వేల కోట్లు ఇచ్చిందని.. రూ.35వేల కోట్లు కేంద్రం ఇస్తే.. ఏపీ ప్రభుత్వం రూ. 11 వేల కోట్లే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఏపీలో ఇళ్ల నిర్మాణానికి రూ. 11 వేల కోట్లే ఖర్చు పెట్టామని మంత్రి బొత్స స్వయంగా చెప్పారని.. ఇళ్ల నిర్మాణాలకు నిధులివ్వకుండా.. అక్రమాలు చేస్తూ పవన్ కళ్యాణ్‌ను విమర్శించడమేంటని నిలదీశారు. ఇళ్ల నిర్మాణంపై జనసేనతో కలిసి ఉద్యమిస్తామని సోము వీర్రాజు ప్రకటించారు.