Somu Veerraju key comments: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉన్న రెండు పార్టీలు కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, వ్యాపార పార్టీలు అని టీడీపీ, వైసీపీలను ఉద్దేశించి ఆరోపించారు. టీడీపీ, వైసీపీలు కవల పిల్లలు అని అన్నారు. మళ్లీ మళ్లీ చెప్తున్నానని.. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతోనే తమ ప్రయాణం అని సోము వీర్రాజు స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రూ. 7,798 కోట్లు ప్రాజెక్టులు కింద ప్యాకేజీ తీసుకున్నారని గుర్తుచేశారు. అధికార పార్టీలో నోరు తిరగని వాళ్ళతో మాట్లాడించటం కాదని.. రాష్ట్రంలో ఎక్కడెక్కడ మట్టి మాఫియా, ఇసుక మాఫియా ఉన్నాయో తాము చూపిస్తామని వివరించారు. కరోనా కాలంలో ఏపీలో రూ.2 కోట్ల విలువైన వాక్సిన్‌లు పంపిణీ చేశామన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం వైసీపీ అసమర్ధతకు నిదర్శనమన్నారు.
Read Also: Group Politics in Madugula TDP : మాడుగుల టీడీపీలో పరిస్థితి మరింతగా దిగజారిందా..?
రాష్ట్రాన్ని టీడీపీ, వైసీపీలు నడిరోడ్డుమీద విడిచిపెట్టాయని సోము వీర్రాజు విమర్శించారు. చంద్రబాబు అభివృద్ధి చేయలేదని జగన్‌కు రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారని.. కానీ రాష్ట్రాన్ని పాలించటంలో జగన్ విఫలం చెందారని ఆరోపించారు. 2024లో రాష్ట్ర ప్రజలు బీజేపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఏ పార్టీ నాయకులు ఏం చేశారో బీజేపీ త్వరలోనే బయటపెడుతుందన్నారు. 1978 నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని.. ఇంకా ఉంటానన్నారు. ఏపీలో నిజమైన ప్రతిపక్షం అంటే బీజేపీనే అన్నారు. తాము ఉద్యమాలు చేశాకే దేవాలయాలపై దాడులు ఆగాయన్నారు. టీటీడీ బోర్డ్ లో 100 మందిని వేస్తే తామే ప్రశ్నించామని.. ఈ విషయంపై టీడీపీ ఏమైనా మాట్లాడిందా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. రాయలసీమ జిల్లాల్లో ప్రాజెక్టులు కోసం త్వరలో పాదయాత్ర చేస్తానని తెలిపారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని.. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌ల అకౌంట్లలో నిధులు వేసే వరకు పోరాటం చేస్తామని సోము వీర్రాజు పేర్కొన్నారు.