కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు నిర్వహించిన ఆందోళన విధ్వంసానికి దారి తీసిన విషయం తెలిసిందే.. అయితే, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ధ్వంస రచన ఒక పథకం ప్రకారం జరిగిందని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. అగ్నిపథ సాకు మాత్రమే.. ధ్వంసం వారి లక్ష్యంగా పేర్కొన్న ఆయన.. విదేశీ శక్తులతో పాటు ఇక్కడ ఉన్న కొన్నివర్గాలు కలిపి చేస్తున్న విధ్వంసమే ఇది అని విమర్శించారు.. మీడియా ద్వారా వస్తున్న ఆడియో పరిశీలిస్తే ఒక గంటలో మొత్తం ధ్వంసం చేయాలని ఆడియో ఆదేశాలు వచ్చాయంటేనే అర్థం అవుతోందని.. ముందస్తు చర్యల్లో భాగంగా విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర రైల్వే స్టేషన్లలో భద్రత పెంచాలని సూచించారు.. ఇదే సమయంలో రైల్వే ప్రయాణికులకు రక్షణ కల్పించాలని సూచించారు సోము వీర్రాజు.
Read Also: Minister Botsa: బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో, హెరిటేజ్ జ్యూసో అనుకున్నావా ..?
కాగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.. ఇప్పటికే ఆర్మీ అభ్యర్థులు ఏఏ జిల్లాల నుంచి వచ్చారు.. వారిని రప్పించింది ఎవరు..? విధ్వంసానికి పాల్పడింది ఎవరు? అనే విషయాలను ఆరా తీస్తున్నారు.. కేసులు నమోదు చేసి ఇప్పటికే 22 మందిని అరెస్ట్ చేశారు.. మరోవైపు.. సికింద్రాబాద్ ఘటన వెనుక కీలక సూత్రధారిగా భావిస్తోన్న సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన సుబ్బారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు విధ్వంసానికి ఎలా ప్లాన్ చేశారు.. అభ్యర్థులను ఎలా రప్పించారు..? దీని వెనుక దానికి ఉన్న కుట్ర కోణం ఏంటి? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.