ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పొత్తు రాజకీయాలు నడుస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉన్నప్పటికీ, ఏయే పార్టీలు ఎవరెవరితో చేతులు కలపనున్నాయన్న అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీ నేతలందరూ దీనిపై స్పందిస్తున్నారు. తాజాగ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ విషయంపై స్పందించారు. పొత్తుల విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని, జనసేనతో పొత్తు కొనసాగుతోందని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే.. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందా? లేదా? అనే విషయంపై జనసేనాధినేత పవన్ కళ్యాణే క్లారిటీ ఇవ్వాలని అన్నారు. బీజేపీ మాత్రం కుటుంబ పార్టీలతో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు.
అయితే.. అభిమానులు, జనసేన కార్యకర్తలు మాత్రం ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా బరిలోకి దిగాలని కోరుకుంటున్నారు. గతంలో టీడీపీతో పెట్టుకున్న పొత్తు విషయంలోనూ జనసేనకి వ్యతిరేకత ఎదరైన విషయం తెలిసిందే! ఇప్పుడు బీజేపీతో ఉన్న పొత్తు వ్యవహారంలోనూ విమర్శలు ఎదురవుతున్నాయి. అందుకే, పవన్ ఒంటరిగా బరిలోకి దిగితేనే మంచిదని కోరుకుంటున్నారు. అటు, కొందరు రాజకీయ నేతలు సైతం పవన్ సింగిల్‌గా ఎలెక్షన్స్‌లో పోటీ చేయాలని ఆకాంక్షిస్తున్నారు. పొత్తు వల్ల ఇతర పార్టీలకే లాభం ఉంటుందే తప్ప, జనసేనకి ఒరిగేదేమీ ఉండదని రాజకీయ నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. మరి, ఎన్నికలు వచ్చేలోపు పవన్ ‘పొత్తు రాజకీయాల’పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.