Somu Veerraju: కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.. అప్పటికే ఆయన బీజేపీ అగ్రనాయకత్వంలో మాట్లాడారని.. జాతీయ స్థాయిలో ఆయనకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని.. అన్ని సెట్ అవుతే.. త్వరలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు.. అయితే, చిత్తూరులో మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. కిరణ్ కుమార్ రెడ్డి ఇష్యూపై స్పందించారు.. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికను స్వాగతించిన సోము వీర్రాజు.. ఎవరు వచ్చినా స్వాగతిస్తాం అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చురుకైన నాయకుడు.. కిరణ్ చేరిక రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి దోహదపడుతుంది. అతనికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు సోము వీర్రాజు.
Read Also: BRS Vs BJP: బండి సంజయ్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్.. నోటీసులు జారీ
ఇక, శాసన మండలి ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ముందుగానే ఓటమిని అంగీకరించినట్లు ఉందని వ్యాఖ్యానించారు సోము వీర్రాజు.. కనీసం పదవ తరగతి చదవని వారికి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలలో ఓటర్లుగా నమోదు చేయడం ప్రజాస్వామ్యనికి గొడ్డలి పెట్టు లాంటిదని ఆవేదన వ్యక్తం చేశారు.. పెద్దల సభను కలుషితం చేయడం నైతికతకాదన్న ఆయన.. గ్రాడ్యుయట్ కానీ వారికి ఓటు హక్కు కల్పించడంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు.. వాలంటీర్ వ్యవస్థను ఎన్నికలకు వినియోగించడం సమంజసం కాదన్న ఆయన.. సక్రమంగా ఎన్నికలు జరిగితే ప్రజలు బటన్ నొక్కి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ నిధులతోనే ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఇసుక, ఖనిజాలను వైసిపి ప్రభుత్వం దోపిడీ చేస్తుందని మండిపడ్డారు. విశాఖపట్నంలో డబ్బులతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు.. బోగస్ ఓట్లు పై ఆధారాలతో ఇప్పటికే ఫిర్యాదు చేశామన్నారు.
Read Also: Harish Shankar: అది అట్టా ఏసుకో మావా… ఆ కామెంట్స్ ఆ దర్శకుడికేనా?
మరోవైపు.. జనసేన పార్టీ. బీజేపీతోనే ఉందన్నారు సోము వీర్రాజు.. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు ఇచ్చిందని తెలిపారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. కాగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్టు చెపుతున్నారు. ఇప్పటికే ఆయనతో బీజేపీ అగ్రనేతలు చర్చలు జరిపినట్టు సమాచారం. రెండు, మూడు రోజుల్లో బీజేపీ అగ్ర నాయకుల సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఏపీ బీజేపీలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. అంతేకాదు, జాతీయ స్థాయిలో ఆయనకు కీలక బాధ్యతలను కూడా అప్పగించనున్నారని ప్రచారం సాగుతోంది.