SomiReddy: ఏపీలో బహిరంగ సభలు, రోడ్డు షోలపై వైసీపీ ప్రభుత్వం రాత్రికి రాత్రే ఆంక్షలు విధిస్తూ ప్రత్యేకంగా జీవో విడుదల చేయడాన్ని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తప్పుబట్టారు. ఈ సందర్భంగా జగన్ సర్కారు తీరుపై సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై సభలు, సమావేశాలు పెట్టరాదన్న ప్రభుత్వ నిర్ణయం హేయమని అన్నారు. స్వాతంత్య్రానికి ముందు ఇవే ఆంక్షలు ఉండి ఉంటే దేశానికి స్వాతంత్రం వచ్చేది కాదని సోమిరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని.. ప్రభుత్వ తీరుపై రోడ్ల మీద కాకుండా పొలాల్లో, గుంటల్లో, చెరువుల్లో నిరసనలు తెలపాలా అని సోమిరెడ్డి ప్రశ్నించారు.
Read Also: Janasena Party: శాంతిభద్రతల పేరుతో హక్కులను కాలరాస్తున్నారు
నిరసనలు, సభలు, ర్యాలీలు చేసే హక్కు ఈ దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గుర్తుచేశారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న ఘటనల వెనుక కుట్ర దాగుందన్న అనుమానం కలుగుతుందన్నారు. జగన్ నిర్ణయాలు చూస్తుంటే మన దేశంలో ఏపీ ఒక భాగమో.. కాదో అనే డౌట్ వస్తోందని సోమిరెడ్డి అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో వేలాది మంది మధ్య సెక్యూరిటీని ప్రక్కన పెట్టి ఓటేసిన ప్రధాని కంటే గొప్పవాడా జగన్మోహన్ రెడ్డి అని నిలదీశారు. సీఎం జగన్ ధైర్యంగా ప్రజల్లోకి రాలేకపోతున్నాడని.. మిగిలిన వాళ్లను కూడా ప్రజల్లోకి వెళ్లకూడదంటే ఎలా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ప్రజల్లో తిరిగే ధైర్యం లేదని… చంద్రబాబు, లోకేష్ , టీడీపీ నేతలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని సోమిరెడ్డి తెలిపారు.