తెలంగాణ మంత్రి కేటీఆర్ పొరుగు రాష్ట్రంపై చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి.. ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కేటీఆర్‌కు కౌంటర్ ఇస్తే.. కొందరు టీడీపీ నేతలు స్వాగతించారు.. మరికొందరు టీఆర్ఎస్-వైసీపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. అయితే, కేటీఆర్ ఎపిసోడ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. నిన్నటి టీడీపీ నేతల కామెంట్లకు భిన్నంగా సోమిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేశారు సోమిరెడ్డి.. తెలంగాణను చూసి ఏపీ కొన్ని అంశాలైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. రైతు బంధు పథకం కింద తెలంగాణలో రైతులకు ప్రతి ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నారు.. ఏపీలో మాత్రం ఎన్ని ఎకరాలున్నా రైతు భరోసా కింద ఇచ్చేది ఒక్కో కుటుంబానికి రూ.7500 మాత్రమే అన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగానికి 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నారు.. ఏపీలో మాత్రం 9 గంటల నుంచి 7 గంటలకు తగ్గించారని దుయ్యబట్టారు. ఈ ఘనకార్యాలు చేసినందుకు ఏపీ ప్రభుత్వాన్ని పొగాడాలా..? అంటూ ప్రశ్నించారు సోమిరెడ్డి.
Read Also: Talari Venkat Rao: నాపై దాడి చేసింది వైసీపీ కార్యకర్తలు కాదు..!
రైతులు పండించిన పంటను గింజ గింజా కొనుగోలు చేసి మూడో రోజే తెలంగాణ ప్రభుత్వం రైతులకు నగదు జమ చేస్తోందని ప్రశ్నించారు సోమిరెడ్డి.. ఏపీలో ప్రభుత్వం రైతుల వద్ద 50 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయడం లేదని ఆరోపించిన ఆయన.. కొన్న కొద్ది ధాన్యానికి కూడా డబ్బులివ్వడానికి ఆరేడు నెలలు పడుతోందన్నారు. ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయమని ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ పోరాటం చేసిందని గుర్తుచేశారు. కేంద్రం కొనుగోలు చేయకపోవడంతో చివరకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని ప్రశంసలు కురిపించారు. ఇక, పెట్టుబడులన్నీ ఏకపక్షంగా తెలంగాణకు వెళ్లిపోతున్నాయని.. ఏపీలో పెట్టుబడి పెట్టేవారు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధికి అర్థం తెలియని ఏపీ మంత్రులు.. ఏపీలో అభివృద్ధి విషయంలో అద్భుతాలు జరిగాయని జోకులేస్తున్నారని సెటైర్లు వేశారు. ఈ మూడేళ్లలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో, ఏం సాధించారో అర్థం కావడం లేదు.. రైతు భరోసా కేంద్రాలు.. రైతు భక్షక కేంద్రాలుగా మారిపోయాయని మండిపడ్డారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.