ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్కోచ్ ‘స్టార్ ఆఫ్ గవర్నెన్స్-2021’ అవార్డుకు ఎంపికైంది. జూన్ 18న ఢిల్లీలో జరిగే ఇండియన్ గవర్నెన్స్ ఫోరం వేదికగా ఈ అవార్డు ప్రదానం చేస్తారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదికి రాసిన లేఖలో స్కోచ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ దలాల్ వెల్లడించారు.
కాగా గ్రామీణాభివృద్ధి శాఖకు స్కోచ్ అవార్డు లభించడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ గ్రామీణ పాలనలో అనుసరిస్తున్న విప్లవాత్మక విధానాలు, సంస్కరణల వల్లే రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. పారదర్శకత, ప్రజల వద్దకే ప్రభుత్వ సేవల సహా అనేక పథకాలతో సీఎం జగన్ పాలన అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. స్కోచ్ అవార్డు వచ్చిన సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఇతర అధికారులు, ఉద్యోగులను డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అభినందించారు.