పల్నాడు జిల్లాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోనసీమ ఘటన చాలా దురదృష్టకరమని.. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు అసాంఘిక, సంఘ విద్రోహుల కారణంగా హింసాత్మక ఘటనలు జరిగాయని కొడాలి నాని ఆరోపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌పై కొడాలి నాని ఫైర్ అయ్యారు. అమలాపురంలో పిల్లలను రెచ్చగొట్టి ఆయన పబ్బం గడుపుకుంటున్నారని విమర్శలు చేశారు. శాంతిభద్రతలను కాపాడలేదని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని.. అమలాపురంలో ఫైరింగ్ చేసి ఉంటే పరిస్థితి అదుపులోకి వచ్చేదని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. అయితే పిల్లల ప్రాణాలు పోతాయని ఫైరింగ్ చేయలేదని వివరించారు.
Minister Botsa: వాళ్లు అధికారంలో ఉంటే అతివృష్టి లేదంటే అనావృష్టి
కోనసీమ జిల్లాలకు అంబేద్కర్ పేరు పెట్టమని చంద్రబాబు అడిగితే పవన్ కళ్యాణ్ కూడా మద్దతు పలికారని మాజీ మంత్రి కొడాలి నాని గుర్తుచేశారు. కానీ టీడీపీ, జనసేన పార్టీలు పక్కా వ్యూహం ప్రకారమే కోనసీమలో ఘర్షణలకు తెరలేపాయని ఆయన ఆరోపించారు. వైసీపీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేల కుటుంబాలపై దాడి చేసి ఇళ్లు తగలబెట్టారని కొడాలి నాని మండిపడ్డారు. కోనసీమలో జరిగిన అల్లర్లన్నీ ప్రతిపక్ష పార్టీ నేత, దత్త పుత్రుడు కలిసే చేశారని విమర్శించారు. సొంత మామ సీటు లాక్కొని ఆయన చావుకు కారణమైన ఘనత చంద్రబాబుకు మాత్రమే దక్కిందని ఎద్దేవా చేశారు. పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనిస్పిస్తుందని.. చంద్రబాబు మోసం చేయటంలో దిట్ట అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ అసత్యాలు పలకడంలో డిగ్రీ తీసుకున్నాడని.. రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబు-పవన్ కళ్యాణ్ కలయిక అని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ పేర్కొన్నారు.