పీఆర్సీ ఉద్యమం ఉధృతమైంది.. సమ్మెకు సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.. ఇప్పటికే పెన్ డౌన్ అంటూ.. ఆందోళనను ఉధృతం చేశారు.. అయితే, ఉద్యోగ సంఘాల నేతల తీరుపై సీరియస్ గా స్పందించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. మాటలు, వాటికి కౌంటర్లు చేస్తూ వెళితే అసలు సమస్య డైవర్ట్ అవుతుందని.. దీని వల్ల ఉద్యోగులకే నష్టం అన్నారు.. ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్ధం కావడం లేదన్న ఆయన.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందన్నారు.. ఆ మేరకు చర్యలు తీసుకోక తప్పదన్నారు.. అయితే, ఇప్పటికీ చర్చలకు ఓపెన్ ఆహ్వానం ఉందన్న సజ్జల.. ప్రతి రోజు పిలవటం ఉండదు కదా? వాళ్లు మేం చర్చలకు వస్తాం అంటే వెళ్లటానికి మేం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
Read Also: ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ ఫోకస్.. కీలక సమావేశం
ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం.. వాళ్ల పై వాళ్లే ఒత్తిడి చేసుకోవటం సరికాదన్నారు. ఇక, బయటి రాజకీయ పార్టీలు వస్తే పరిస్థితి చేయి దాటిపోతుంది… అప్పుడు ఉద్యోగులది ప్రేక్షకపాత్ర అవుతుందన్నారు సజ్జల.. రాజకీయ, అసాంఘిక శక్తులు కూడా చలో విజయవాడలో పాల్గొన్నాయన్న ఆయన.. వామపక్షాలు పాత్ర ఉందని నిన్న జెండాల ద్వారానే అర్థం అవుతుందన్నారు. ఆరోగ్య శాఖలో ఎమర్జెన్సీ సర్వీసులు ఆపితే… దానికి పరిణామాలు కూడా వాళ్లు చూడాల్సి ఉంటుందని హెచ్చరించిన సజ్జల.. నోటీసు ఇచ్చాం కనుక ప్రభుత్వం ఏం చేయకుండా చేతులు కట్టుకుని కూర్చోవాలి అంటే ఎలా సాధ్యం అవుతుంది? అని మండిపడ్డారు.. పరిస్థితిని వాళ్ళకు వాళ్లే చెడగొట్టుకుంటున్నారు.. రాజకీయ కారణాలు ముందుకు తోసుకుని వస్తున్నాయనిపిస్తోందని అనుమానాన్ని వ్యక్తం చేశారు.. సాధారణ ప్రభుత్వ సేవలు యథాతధంగా కొనసాగటానికి ఏం చేయాలో ప్రభుత్వం అన్నీ చేస్తుంది.. చూసే వాళ్లను బట్టి ఉంటుందని.. ఇంత మంది ఉద్యోగులకు సంబంధించి అంశాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయదు కదా? అని ఎదురుప్రశ్నించారు.. ఉద్యోగులు వాళ్లకు కావాల్సిన సమస్యలు ప్రాధాన్యత వారీగా ఎందుకు లిస్ట్ చేయటం లేదో అర్ధం కావటం లేదు? అని ఆవేదన వ్యక్తం చేశారు సజ్జల.. సమాన పనికి సమాన వేతనం నుంచి 75 డిమాండ్లను ఒకేసారి పూర్తి చేయాలంటే ఎలా సాధ్యం అవుతుంది? అని నిలదీశారు.. పీఆర్సీకి సంబంధించి మూడు నాలుగు డిమాండ్ల పై చర్చలు చేస్తే పరిష్కారం అవటానికి అవకాశం ఉంటుందని.. ఓపెన్ మైండ్ తో మంత్రులు రావటం లేదని స్టీరింగ్ కమిటీ నేతలు చెప్పటం తప్పే అన్నారు.