రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ బహిరంగంగానే ప్రకటించింది. అయితే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ మాత్రం తమ వైఖరిని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ వైఖరిని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తమకు ఎర్రకోట మీద జెండా ఎగరేయాలని, ఢిల్లీలో చక్రం తిప్పాలన్న ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి రాష్ట్ర ప్రయోజనాల మీదే ఉన్నాయని తెలిపారు.
Read Also: MLA Seethakka: కాంగ్రెస్ పంచితే.. టీఆర్ఎస్ గుంజుకుంటోంది
రాజ్యాంగపరమైన పదవుల విషయంలో ఏకాభిప్రాయం ఉండాలన్నది తమ విధానం అని.. అందుకే ఎస్టీ మహిళ రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి తమ పార్టీ మద్దతు ఇచ్చిందని సజ్జల వివరించారు. గతంలో టీడీపీ హయాంలో స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు కూడా మద్దతు ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. అయితే రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై టీడీపీ ఎందుకు ఇంత వరకు తన వైఖరి ప్రకటించటం లేదని సజ్జల ప్రశ్నించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు ఉంటేనే మద్దతు ఇస్తారా అని నిలదీశారు. లేకపోతే విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు చంద్రబాబు సపోర్ట్ చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు.