టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. రామతీర్థం ఘటనకు సంబంధించి అశోక్ గజపతిరాజుపై నమోదైన కేసులో తదుపరి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో ఇటీవల జరిగిన కోదండరాముని ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది.
Read Also: తిరోగమనం వైపు పీఆర్సీ..! మళ్లీ ఉద్యమానికి ఉద్యోగ సంఘాలు రెడీ
ఈ ఘటన నేపథ్యంలో అశోక్ గజపతిరాజుపై రామతీర్థం ఆలయ ఈవో ప్రసాద్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, ఆస్తి ధ్వంసం జరగడంతో పాటు గందరగోళం సృష్టించారని ఈవో ఫిర్యాదు చేయడంతో నెల్లిమర్ల పోలీసులు ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజుపై రెండు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. దీంతో అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోర్టును కోరారు. ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి చర్యలు నిలిపివేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.