Bride collapses during garland exchange dies on stage: ఒక పెళ్లి వేడుకలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అప్పటివరకూ ఆ పెళ్లి వేడుకలో హుషారుగా కనిపించిన వధువు, వేదికపైనే ఒక్కసారిగా కుప్పకూలింది. సరిగ్గా పూలదండలు మార్చుకుంటున్న సమయంలో ఆమె హఠాన్మరణం చెందింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని భద్వానా గ్రామానికి చెందిన శివాంగి అనే యువతికి వివేక్ అనే యువకుడితో పెళ్లి ఖాయం చేశారు. ఇద్దరి ఇష్టాలతోనే ఈ పెళ్లి ఖరారు చేశారు. దీంతో.. అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకను నిర్వహించారు. ఘనంగా ఏర్పాటు చేసి, బంధుమిత్రులను ఆహ్వానించారు.
ఇక పెళ్లి తంతు మొదలైంది. వేదికపైకి వధవు, వరుడు వచ్చారు. ఈ దృశ్యాల్ని కెమెరాలో బంధించేందుకు కెమెరామెన్లు కూడా వచ్చేశారు. వధూవరుల చుట్టు కొద్దిమంది జనం చుట్టుముట్టారు. ఇక పూలదండలు మార్చుకోవడమే ఆలస్యం. అయితే.. వరుడి మెడలో పూలమాల వేస్తున్న సమయంలో వధువు శివాంగి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో, అక్కడున్న వారంతా ఆందోళన చెందారు. ఏం జరిగిందో తెలియక టెన్షన్ పడ్డారు. అటు వరుడు సైతం కంగారుపడ్డాడు. తొలుత స్పృహ తప్పి పడిపోయిందేమోనని అనుకున్నారు. కానీ, ఆసుపత్రికి తరలించాక అసలు విషయం తెలిసింది. ఆసుపత్రిలో శివాంగిని పరిశీలించిన వైద్యులు.. మార్గమధ్యంలోనే ఆమె గుండెపోటుతో చనిపోయిందని తెలిపారు.
వైద్యులు చెప్పిన ఆ మాటతో.. పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. సంతోషంగా ముగియాల్సిన ఆ వేడుక, ఈ ఘటనతో విషాదాంతంగా మారింది. శివాంగి కుటుంబ సభ్యులందరూ కన్నీరుమున్నీరవుతున్నాయి. అత్తారింటికి పంపాల్సిన తమ అమ్మాయిని, ఇలా కాటికి పంపించాల్సి వస్తుందని అనుకోలేదంటూ రోదిస్తున్నారు. మరోవైపు.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.