Tirumala: టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఈ సందర్భంగా సీఎం జగన్ తిరుమల టూర్‌పై రమణ దీక్షితులు అసహనం వ్యక్తం చేశారు. తిరుమల పర్యటనలో సీఎం జగన్ వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ అమలుపై ప్రకటన చేస్తారని భావించామని.. ఆయన ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అర్చకులంతా తీవ్ర నిరాశ చెందారని రమణదీక్షితులు ఆరోపించారు. టీటీడీలోని బ్రాహ్మణ వ్యతిరేకులు అర్చక వ్యవస్థను, ఆలయ విధానాలను నాశనం చేసే లోపే తగిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నామని రమణ దీక్షితులు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కొంతకాలంగా టీటీడీ పరిధిలోని ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వంపై వివాదం సాగుతోంది. టీటీడీలో వంశపారంపర్యంగా వచ్చే అర్చకుల శాశ్వత నియామకంపై ఏపీ ప్రభుత్వం గతంలో ఏకసభ్య కమిటీని నియమించింది. వారసత్వ అర్చకుల వ్యవస్థ బలోపేతం, క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ టీటీడీలో వారసత్వ అర్చక విధానాన్ని మరింత బలంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సూచించనుంది.
Read Also:Fire accident: రెస్టారెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 17 మంది మృతి
అయితే 60 ఏళ్లు నిండిన తర్వాత అర్చకత్వం చేయడం కష్టంతో కూడుకున్న పని అని.. 60 ఏళ్లు దాటిన వారికి వారి వంశంలో యువకులకు అర్చకత్వం చేసే అవకాశాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. అయితే వంశపారంపర్య అర్చకత్వం కొనసాగించాలని రమణదీక్షితులు కోరుతున్నారు. అర్చకులకు పదవీ విరమణ వయసు ఉండదని.. వారు చేయగలిగినంత కాలం అర్చకత్వం చేస్తారని ఆయన న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే రమణదీక్షితులతో టీడీపీ హయాంలో పదవీ విరమణ చేయించారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రమణదీక్షితులును గౌరవ ప్రధాన అర్చకుడిగా నియమించారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో 52 మంది అర్చకులు ఉండగా వారిలో 48 మంది అర్చకులు సర్వీస్ రికార్డ్ ఎస్‌ఆర్ విధానానికి మొగ్గు చూపారు. దీంతో మిరాశీ వంశీకులకు, టీటీడీకి మధ్య అన్ని విషయాలు సర్దుబాటు అయ్యాయని భావిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వన్ మ్యాన్ కమిటీని నియమించింది.