ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వర్షాలు దండికొడుతున్నాయి.. రాయలసీమలోనూ వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి… అయితే.. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చే సింది.. ఐఎండీ సూచనల ప్రకారం.. ఉత్తర అండమాన్ సముద్రం మరియు చుట్టుపక్కల పరిసరాల్లో ఈనెల 18న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ తెలిపారు. ఇది అక్టోబర్ 20 నాటికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య మరియు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనున్నట్లు పేర్కొన్నారు.. వీటి ప్రభావంతో.. రాష్ట్రంలో రాబోవు మూడు రోజులు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు..
Read Also: Fake Accounts : ఒంటరి మహిళలే టార్గెట్.. రిక్వెస్ట్ పెట్టి రిస్క్‌లోకి నెడుతారు..
ఆదివారం రోజు.. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉండగా.. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని.. ఇక, సోమవారం రోజు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,ఏలూరు, పల్నాడు, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.. మరోవైపు.. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. అలాగే మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంటుందన్నారు.. అయితే, వర్షాలు నేపథ్యంలో కృష్ణా, పెన్నా నదులు వరద ప్రవహించే అవకాశం ఉన్నందున నదీపరీవాహక ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని, లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది విపత్తుల సంస్థ..