ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై రాహుల్ కీలక మంతనాలు చేస్తున్నారు. త్వరలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు రాహుల్ గాంధీ. ఆగస్టు 10వ తేదీన ఢిల్లీకి రావాలని కొంతమంది సీనియర్ నేతలకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు ఇచ్చింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై చర్చించనున్నారు రాహుల్. ఏపీ రాష్ట్రానికి చెందిన కొద్దిమంది సీనియర్ నాయకులతో విడివిడిగా, ముఖాముఖి సమాలోచనలు జరపనున్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీని ఏపిలో బలోపేతం చేసేందుకు రాష్ట్ర నేతల ఆలోచనలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకోనున్నారు.
ఇక రాష్ట్ర నేతల అభిమతం తెలుసుకున్న తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోనున్న రాహుల్ గాంధీ. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు డా. చింతా మోహన్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జే.డి. శీలం, మాజీ ఎమ్.పి డా. కే. వి. పి. రామచంద్ర రావు, ఏఐసిసి సెక్రటరీ గిడుగు రుద్రరాజు లను ఢిల్లీ కి రావాలని కోరింది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. ఏపి కి కొత్త పిసిసి అధ్యక్షుడు నియామకం తో సహా, కొంతమంది ఏపి నేతలకు జాతీయ స్థాయు లో బాధ్యతలు అప్పగించాలనే యోచనలో రాహుల్ గాంధీ ఉన్నారు.
ఇటీవలే, ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ కే.సి. వేణుగోపాల్ తో సమావేశమై, విపులంగా చర్చించిన ఏపి ఇంచార్జ్ ఉమన్ చాండి, ఇంచార్జ్ ఏఐసిసి సెక్రటరీలు క్రిస్టోఫర్, మయప్పన్… ఆ తర్వాత రాహుల్ గాంధీతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించి, నివేదికను కూడా అందజేసారు కే.సి. వేణుగోపాల్, ఏపి కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఉమన్ చాండీ, ఇంచార్జ్ ఏఐసిసి సెక్రటరీలు క్రిస్టోఫర్, మయప్పన్…. ఏపిలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు కొన్ని సూచనలతో కూడిన కార్యాచరణ ను రాహుల్ గాంధీ కి అందజేసారు ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ ఉమన్ చాండి. అవసరాన్ని బట్టి మరికొంతమంది ఏపి రాష్ట్ర నేతలను కూడా రాహుల్ గాంధీ విడిగా కలిసే అవకాశం ఉంది. ఈ కసరత్తంతా పూర్తయున తర్వాత సెప్టెంబర్ మొదటివారం లో కొంతమంది రాష్ట్ర నేతలకు పార్టీ పదవులు, బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. సెప్టెంబర్ నెలాఖరుకు రాహుల్ గాంధీ ఏపిలో పర్యటించే అవకాశం ఉంది.