R Krishnnaiah: విజయవాడలో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో వైసీపీ రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక రాష్ట్రాలలో ఎన్నో సంవత్సరాల పాటు బీసీలు ముఖ్యమంత్రులుగా పనిచేశారని.. కానీ ఏ ఒక్కరూ బీసీలకు పూర్తిగా న్యాయం చేయలేకపోయారని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. కానీ ఏపీ సీఎం జగన్ బీసీ కాకపోయినా బీసీల పక్షపాతిగా నిలిచారని ప్రశంసలు కురిపించారు. అందుకే సీఎం జగన్‌ను సంఘ సంస్కర్తగా పరిగణించాలని ఆర్.కృష్ణయ్య సూచించారు. కులాల ఆత్మగౌరవాన్ని గుర్తించిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. ఏపీలో బీసీలను వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని పేర్కొన్నారు.
Read Also: Comedian Ali: బిగ్ బ్రేకింగ్.. ఆలీకి కీలక పదవి కట్టబెట్టిన జగన్
మరోవైపు బీసీల ఆత్మగౌరవ సభలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొని ప్రసంగించారు. బీసీ ఉద్యమానికి ఆర్ కృష్ణయ్య ప్రముఖుడు అని.. ఆయన లాంటి ఉద్యమ నేతకు రాజ్యసభ సీటు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని సజ్జల తెలిపారు. బీసీలకు వెన్నుదన్నుగా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉండి బీసీలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. గడిచిన మూడున్నర ఏళ్లలో బీసీల జీవితాలలో గణనీయమైన మార్పు వచ్చిందని సజ్జల అన్నారు. ప్రభుత్వంపై ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని.. గత మూడున్నర ఏళ్లలో అసమానతలను తొలగించామని చెప్పారు. జాతీయ పార్టీలో ఉండి కూడా దివంగత సీఎం వైఎస్ఆర్ బీసీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన తన ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యనికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. బీసీల తలరాతలను వారే మార్చుకునేలా సీఎం జగన్ బీసీలకు అవకాశం కల్పించారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశంసలు కురిపించారు.