ఏపీలో పొత్తులపై వాడివేడిగా మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ.. గతంలో మన మిత్రపక్షంగా ఉన్న టీడీపీ సరిగా పట్టించుకోలేదని, బీజేపీ కార్యకర్తలు ఇచ్చిన రిప్రజెంటేషన్లను మన మిత్రపక్షంగా ఉన్న వాళ్లు చించేసేవారని ఆమె అన్నారు. పరిస్థితి ఈ విధంగా ఉందని నాడు అమిత్ షా దృష్టికి తీసుకెళ్తే.. మీ బలమెంత..? అని అమిత్ షా ప్రశ్నించారని ఆమె అన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
పార్టీ పునాదులు గట్టిగా ఉంటే.. అనుకూల, ప్రతికూల పవనాలు అనే పరిస్థితి ఉండదని ఆమె వెల్లడించారు. గత ఎన్నికల్లో కేవలం 0.83 శాతం మేర ఓట్లే వచ్చినా.. ఏపీకి కేంద్రం ఎన్నో నిధులు ఇచ్చిందని, కేంద్రం ఎన్నో నిధులిస్తోన్నా.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని ఆమె అన్నారు. కేంద్ర నిధులను ఉపయోగించుకుంటూ తమ స్టిక్కర్లను సీఎంలు వేసేసుకుంటున్నారని, ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి రివర్సులో ఉందని ఆమె విమర్శించారు. పెట్టుబడిదారులు పక్క రాష్ట్రానికి వెళ్లిపోతున్నారని, భూ మాఫియా, మట్టి మాఫియా, లిక్కర్ మాఫియాతో ఏపీ నిండిపోయిందని ఆమె ఆరోపించారు.