Pulicat Flamingo Festival: ప్రకృతి ఆరాధకులకు, పక్షుల ప్రేమికులకు పండుగ సమయం వచ్చేసింది. నెల్లూరు , తిరుపతి జిల్లాల సరిహద్దులోని పులికాట్ సరస్సు తీరానికి ఖండాంతరాలు దాటి వచ్చిన విదేశీ పక్షుల సందడి మొదలైంది. ఈ విశిష్ట అతిథుల రాకను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక ‘ఫ్లెమింగో ఫెస్టివల్’ (పక్షుల పండుగ) ఈ ఏడాది జనవరి 10 , 11 తేదీల్లో అత్యంత వైభవంగా జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు సరిహద్దుల్లో దాదాపు 620 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న పులికాట్ సరస్సు, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా గుర్తింపు పొందింది. ఇక్కడి జీవ వైవిధ్యం , సరస్సులో లభించే చేపలు, నత్తలు, వానపాములు వంటి సమృద్ధిగా ఉండే ఆహార వనరుల కారణంగా ఏటా వేల సంఖ్యలో విదేశీ పక్షులు ఇక్కడికి వలస వస్తుంటాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ , జనవరి నెలల్లో నైజీరియా, ఈజిప్ట్, సైబీరియా వంటి దేశాల నుంచి సుమారు 108 రకాల విదేశీ విహంగాలు ఇక్కడికి చేరుకుంటాయి.
తిరుపతి జిల్లాలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం దశాబ్దాలుగా వలస పక్షులకు సురక్షితమైన సంతానోత్పత్తి కేంద్రంగా ఉంది. ప్రస్తుతం నేలపట్టులో గ్రే పెలికాన్, వైట్ ఐబిస్, లిటిల్ కోర్మోరెంట్, స్పూన్ బిల్ స్టార్క్ , ఓపెన్ బిల్ స్టార్క్ వంటి సుమారు ఐదు ప్రధాన రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ దాదాపు 30,000 పక్షులు చేరుకున్నాయని, అవి గూళ్లు కట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలను పొదిగే ప్రక్రియ (Breeding) కూడా ప్రారంభించాయని అధికారులు తెలిపారు. ఈ పక్షులు తమ పిల్లలకు రెక్కలు వచ్చి, అవి ఎగరడం నేర్చుకునే వరకు అంటే ఏప్రిల్ లేదా మే నెలల వరకు ఇక్కడే ఉండి, ఆ తర్వాత తిరిగి తమ స్వస్థలాలకు ప్రయాణమవుతాయి.
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. ఈసారి సూళ్లూరుపేట, దొరవారి సత్రం, తడ, ఇరకం ఐలాండ్, శ్రీ సిటీ , ఉబ్బలమడుగు జలపాతం వంటి ఏడు ప్రధాన వేదికలపై వేడుకలు జరగనున్నాయి. పర్యాటకుల కోసం సాండ్ ఆర్ట్ (ఇసుక శిల్పాలు), స్నేక్ షో , స్థానిక కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. సూళ్లూరుపేట ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శనలు , స్టాల్స్ కొలువుదీరనున్నాయి. తడ భీములవారి పాలెం పడవల రేవు వద్ద సందర్శకులు సరస్సు అందాలను ఆస్వాదించేందుకు ప్రత్యేక బోట్ శికార్ సౌకర్యాన్ని కల్పించారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ , స్థానిక ఎమ్మెల్యేల పర్యవేక్షణలో పర్యాటకుల కోసం అన్ని వసతులు సిద్ధం చేశారు. తాగునీరు, బయో-టాయిలెట్స్ , ట్రాఫిక్ నియంత్రణ వంటి చర్యలు చేపట్టారు. అలాగే, పులికాట్ సరస్సు ప్రాముఖ్యతను , పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించేందుకు పర్యావరణ వేత్తలతో ప్రత్యేక సెమినార్లు కూడా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న తమిళనాడు నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శీతాకాలపు ఆహ్లాదకర వాతావరణంలో, కిలకిలరావాల మధ్య విదేశీ పక్షుల అందాలను వీక్షించేందుకు ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.