నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ 2: తాండవం’ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో విడుదలైనా థియేటర్లలో అడుగు పెట్టాల్సినప్పటి నుంచీ ఈ సినిమాను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి కూడా తీవ్రమైన ఆటంకాలను ఎదుర్కొంటోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, జనవరి 9న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ స్ట్రీమింగ్ వాయిదా పడింది. దీనికి ప్రధాన కారణం నిర్మాతలు మరియు స్ట్రీమింగ్ సంస్థ మధ్య తలెత్తిన ‘రిలీజ్ సెటిల్మెంట్ ఇష్యూస్’ అని తెలుస్తోంది.
Also Read:Sankranthi Box Office: భర్త’ కష్టాలు.. ‘రాజు’ గారి విన్యాసాలు!
సినిమా నిర్మాణ సమయంలోనే నిర్మాతలు కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీని ప్రభావం వల్ల డిసెంబర్ 5న విడుదల కావాల్సిన సినిమా వారం పాటు ఆలస్యమై డిసెంబర్ 12న థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, థియేటర్లలో రన్ పూర్తిగా ముగిసిన తర్వాతే సినిమాను ఓటీటీలో ప్రదర్శించాలి. అయితే ఇప్పుడు సంక్రాంతి సీజన్ కావడంతో థియేటర్ల సమస్య మరో ఇబ్బందిగా మారింది. ఈ సంక్రాంతికి ఏకంగా 5 సినిమాలు బరిలో ఉన్నాయి. దీంతో ‘అఖండ 2’కు థియేటర్లు దక్కడం గగనంగా మారింది. థియేటర్లు లేకపోతే సినిమా రన్ ముగిసినట్టు భావించాలా? లేక అగ్రిమెంట్ ప్రకారం వేచి చూడాలా? అనే సందిగ్ధంలో ఓటీటీ సంస్థ ఉంది. సినిమా థియేట్రికల్ రిలీజ్ విషయంలో జరిగినట్టే, ఇప్పుడు ఓటీటీ విషయంలోనూ ఆర్థిక కారణాలే అడ్డంకిగా మారాయని ట్రేడ్ వర్గాల సమాచారం. బకాయిల చెల్లింపులు పూర్తి కాకపోవడంతో నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్‌ను ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.