Vijayasai Reddy: లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను కేవలం జనాభా ప్రాతిపదికన చేయడం వలన ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, కేరళ తీవ్రంగా నష్టపోతాయని వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభలో సోమవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తుతూ జనాభాయేతర అంశాలైన ఆ రాష్ట్ర భూభాగము, అడవులు, జీవావరణం, ఆర్థిక అంతరాలు, జనాభా నియంత్రణ వంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేసేందుకు ఎప్పుడు చట్టం చేసినా అందులో పైన తెలిపిన జనాభాయేతర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం తప్పనిసరి చేయాలని కోరారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం ప్రక్రియను ఆయన ఆహ్వానిస్తూనే, అది చైతన్యవంతమైన భారత ఆధునిక ప్రజాస్వామ్యానికి చిహ్నం అవుతుందని అన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 888 సీట్లతో కొత్త పార్లమెంట్ ఏర్పాటు కాబోతుందన్న విషయం సంతోషించదగ్గదే. అయినప్పటికీ నియోజకవర్గాల పెంపు కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే జరుగుతుందా అన్న అంశం ఆందోళన కలిగిస్తుందన్నారు.
Sajjala Ramakrishnareddy: మాధవ్ వ్యవహారం కంటే చంద్రబాబు ఓటుకు నోటు అంశమే పెద్దది..
ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన 2001 జనాభా లెక్కల ఆధారంగా జరిగినప్పటికీ, దేశంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య మాత్రం మారలేదు. 1971 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా ఉత్తరప్రదేశ్ జనాభాలో 49.2శాతం మాత్రమే. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తర ప్రదేశ్ జనాభాతో పోల్చుకుంటే ఏపీ జనాభా 6.8% తగ్గి 42.4% కి చేరింది. కొన్ని అంచనాల ప్రకారం ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా ఉత్తరప్రదేశ్ జనాభాలో కేవలం 39.6% మాత్రమేనని ఆయన తెలిపారు. లోక్‌సభ నియోజకవర్గాల పెంపు కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే జరిగితే ఉత్తర ప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్య 50శాతం పెరిగి 120కి చేరుకుంటుంది. అదే సయమంలో ఆంధ్రప్రదేశ్ కేవలం 20% పెంపుతో 30 సీట్లకు పరిమితమవుతుందని అన్నారు. కాబట్టి డీలిమిటేషన్ కమిషన్ కోసం ఎప్పుడు చట్టం చేసినా జనాభాయేతర అంశాలను కూడా ప్రాతిపదికగా తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన జరిగేలా చూడాలని తద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఈ ప్రక్రియలో అన్యాయం జరగకుండా నివారించవచ్చని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.