ఏపీ జీవనాడి ప్రాజెక్టుగా పిలవబడుతున్న పోలవరం ప్రాజెక్టులో కీలకఘట్టం పూర్తయింది. స్పిల్ వేలో 48 రేడియల్ గేట్ల అమరిక పనులు పూర్తయ్యాయి. 2020 డిసెంబర్ 17న గేట్ల ఈ అమరిక పనులు ప్రారంభమయ్యాయి. గత సీజన్‌లో వరదలు వచ్చే నాటికి 42 గేట్లను అమర్చి, వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మిగిలిన 6 గేట్ల అమరిక పనులు సైతం పూర్తి చేశారు. ఇప్పటికే రేడియల్ గేట్లకు అమర్చాల్సిన 96 హైడ్రాలిక్ సిలిండర్లకు 84 సిలిండర్లను అమర్చారు. త్వరలోనే మిగిలిన 6 గేట్లకు 12 సిలిండర్లు అమర్చేందుకు ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేశారు.
మరోవైపు 10 రివర్ స్లూయిజ్ గేట్లను, వాటికి 20హైడ్రాలిక్ సిలిండర్లతో పాటు 10 పవర్ ప్యాక్ సెట్లను కూడా అమర్చడం పూర్తి అవుతుంది. హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చడం పూర్తైతే గేట్ల ఆపరేటింగ్ చేయవచ్చు. ఇప్పటికే గేట్లను ఎత్తడానికి అవసరమైన 24 పవర్ ప్యాక్ సెట్ల అమర్చారు. స్పిల్ వే కాంక్రీట్ పనులు దాదాపు 97.25శాతం పైగా పూర్తి కాగా.. స్పిల్ వేలో 3,32,114 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేశారు. స్పిల్ వేలో కీలకమైన ఫిష్ ల్యాడర్ నిర్మాణం సైతం పూర్తి చేశారు.