ఆంధ్ర ప్రదేశ్ కు ఎంతో కీలమైన పోలవరం ప్రాజెక్ట్ పై ఢిల్లీలో ఈ రోజు కీలక సమావేశం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ డిజైన్లు, నిధులపై ఈ సమావేశం జరుగుతోంది. కేంద్ర జల్ శక్తి సలహాదారు వెదిరే శ్రీరాం అధ్యక్షతన పోలవరం డిజైన్ల పై సమావేశం ప్రారంభం అయింది. గోదావరి వరద ఉధృతికి పోలవరం ప్రధాన డ్యామ్ (ఈసీఆర్‌ఎఫ్) నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటంతో పాటు కొంత భాగం దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను పటిష్ఠం చేయడంపై చర్చించనున్నారు.
ఈ సమావేశానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులతో పాటు, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి సమావేశానికి హాజరయ్యారు. ఈనెల 11న సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఖయ్యూం అహ్మద్ నేతృత్వంలోని అధికారుల బృందం పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలోనే పోలవరంపై కీలక సమావేశం జరుగుతోంది. మరోసారి ఈ బృందం పోలవరం పరిశీలనకు రానున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్ట్ కేంద్రంగా ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ప్రభుత్వ ఎంతో ముఖ్యమైన పోలవరం ప్రాజెక్ట్ ను పట్టించుకోవడం లేదంటూ టీడీపీ విమర్శలు చేస్తోంది. ఇటీవల డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడంపై కూడా ఈరెండ పార్టీల మధ్య తీవ్రంగా వాగ్వాదం నడిచింది. ఏపీ విభజన చట్టంలోని హమీ ప్రకారం పోలవరాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తించి కేంద్రం నిధులతో నిర్మితం అవుతోంది.