పవన్ సినిమా కోసం చంద్రబాబు లోకేష్ లు పిల్లిమొగ్గలు వేస్తున్నారని, సినిమాని కూడా తండ్రీ కొడుకులు రాజకీయాలకు వాడుకుంటున్నారని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ సినిమాని తొక్కడం ఏంటో మాకు అర్ధం కావడం లేదని, చట్టం అమలు అవుతుంటే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమిటి..? ఆయన ప్రశ్నించారు. జీవో 35 పై ప్రతీ సినిమాకి జాయింట్ కలెక్టర్ దగ్గరకి వెళ్ళి రేట్లు ఫిక్స్ చేసుకుని ప్రదర్శించుకోవాలని హై కోర్టు ఆదేశించిందని, నీతి వ్యాఖ్యలు చెప్పే పవన్ కి అది తెలీదా.. అలాంటి పక్రియ ఎందుకు చేసుకోలేదని ఆయన అన్నారు. ఎక్కడైనా జాయింట్ కలెక్టర్ కి లెటర్ పెట్టారా.. హై కోర్టు తీర్పు అన్నా.. ప్రభుత్వం అన్నా వీళ్ళకి లెక్క లేదు.. ఏపీలో టీడీపీ, బీజేపీ జనసేన పార్టీలు బ్లాక్ టికెట్స్ ని ప్రోత్సాహిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
కొత్త జీవో విడుదల చేయడానికి పక్రియ జరుగుతుంది.. లీగల్ ఒపీనియన్ కి వెళ్ళింది.. అన్ని సక్రమంగా జరిగి ఉంటే 24 తేదీన జీవో రావాల్సి ఉంది. ఇంతలో మా మంత్రి గౌతమ్ రెడ్డి చనిపోవడంతో మేమంతా ఆవేదనలో ఉన్నామన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వాయిదా వేసుకున్నారు సినిమాని ఇంకో రెండు రోజులు వాయిదా వేసుకోలేరా? జీవో వచ్చే వరకూ ఆగలేరా..? ఏపీలో సినిమాని ఫ్రీ గా చూపిస్తాను అన్న పవన్‌కు బ్లాక్ టికెట్ల పై ఆశ ఎందుకు..? చంద్రబాబు, లోకేష్ లకు పవన్ సినిమా పై ఉన్న ప్రేమ జూ.ఎన్టీఆర్ సినిమా పై ఎందుకు లేదు? జూ.ఎన్టీఆర్ సినిమా చూడాలని ఉందని ఎందుకు అనలేదు..? అని ఆయన ప్రశ్నించారు. మీ ఎంపీ బావమరిది మహేష్, జూ ఎన్టీఆర్ ప్రభాస్ సినిమాలు చూడండి అని ఎప్పుడైనా ట్విట్ చేసారా అని అన్నారు. ఇండస్ట్రీ అంటే పవన్ ఒక్కడేనా.. మిగతా సినిమాలు లేవా..? జనాలు పవన్ సినిమా ఒక్కటే కాదు.. బాగుంటే అందరి సినిమాలు చూస్తారన్నారు.