విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర నిబంధనల ప్రకారం పదిశాతం విదేశీ బొగ్గు కొనుగోళ్ళకు చర్యలు చేపట్టాలన్నారు. దీనిలో భాగంగా 31 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు దిగుమతికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అంతేకాకుండా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఖరీఫ్ పంటల వల్ల విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. విద్యుత్ కొరత లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆధికారులకు తెలిపారు.
సెప్టెంబర్ నాటికి కృష్ణపట్నం మూడో యూనిట్లో ఉత్పత్తి జరగాలని ఆ దిశగా పనులు ముమ్మరం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. అటవీశాఖలో దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేసే ఉద్యోగులకు స్థానచలనం కలిగించాలని, జిల్లాల విభజన తరువాత అన్ని డివిజన్లు, సర్కిళ్ళలో సిబ్బంది సంఖ్యను క్రమబద్దీకరించాలన్నారు. హేతుబద్దంగా పోస్ట్ లు ఉండేలా చూడాలని, రాష్ట్రంలో ప్రతి యూఎల్‌బీ పరిధిలో ఒక నగరవనం ఏర్పాటు చేయాలని, ఈ ఏడాది రూ.18.02 కోట్లతో ఆరు నగర వనాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎకో టూరిజం కోసం రూ.15 కోట్లు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, రాష్ట్రంలో 49,732 హెక్టార్లలో ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా ప్లాంటేషన్ జరగాలన్నారు.