అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో పెద్దేరు నది ప్రవాహం పైన బ్రిడ్జి పాడైంది. ఒకవైపు అసనీ తుఫాన్ ప్రభావం వల్ల, గతంలో నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరగడం వల్ల అధిక బరువు గ్రానైట్ లారీలు ప్రయాణం చేయడం వల్ల బ్రిడ్జి కుంగిన విషయం తెలిసిందే. శరవేగంగా కుంగిన వంతెన శ్లాబ్ తొలగింపు పనులు సాగుతున్నాయి.
వంతెన కుంగిపోవడంతో అధికారులు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో పలు ప్రాంతాలకు చెందిన వాహనదారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు సత్వరమే పరిష్కరించడానికి ఆర్ అండ్ బి అధికారులు చర్యలు చేపట్టారు. వంతెన కుంగిన ప్రదేశంలో ఆనకట్ట తరహాలో రాళ్లు పేర్చి ఆ పైన తారు రోడ్డు వేయనున్నట్లు చెప్పారు . వంతెన కుంగిన మూడు ఖానా లు మేరకు శ్లాబ్ తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ఇంతకుముందు వంతెనపై రైలింగ్ రాడ్ లను తొలగించారు. వంతెన మొత్తం 20 ఖానా లు వీటిలో మూడు ఖానాలు మాత్రమే కుంగాయి. ఈ ప్రదేశంలో శ్లాబ్ ను తొలగించి. ఆయకట్టు తరహాలో కిందనుంచి వంతెన శ్లాబ్ స్థాయివరకూ రాళ్లను పేర్చి పటిష్టం చేస్తామని ఆ తర్వాత దానిపై తారురోడ్డు వేస్తామని అధికారులు వివరించారు. ఈ పనులు చేయడానికి 20 లక్షల నిధులు మంజూరు అయ్యాయన్నారు.
వంతెన కుంగడంతో వ్యాపారాలు ఆగిపోయాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే వడ్డాది జంక్షన్ బోసిపోయింది. బ్రిడ్జి కుంగడంతో వడ్డాది జంక్షన్ లో వ్యాపారులంతా డీలా పడ్డారు రాకపోకలు లేక షాపులను చాలావరకూ మూసి వేశారు. ఇటీవల కాలంలో పునః ప్రారంభమైన వెంకటేశ్వర థియేటర్ సర్కారు వారి పాటకు కూడా ఆడియన్స్ కరువయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే ఆడపిల్లలకు నదీ ప్రవాహంలో నుండే పరీక్షలకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ప్రత్యామ్నాయ మార్గం గుండా వెళ్లాలంటే సుమారు పది కిలోమీటర్లు ప్రయాణం చేయవలసిందే.
వంతెన కూలడంతో ఆటో చార్జీలు పెరిగిపోయాయి డ్రైవర్లు ఒక్కసారిగా ఛార్జిలు రెట్టింపు చేశారు. గతంలో వడ్డాది గ్రామం నుండి చోడవరం కి చార్జి 20 రూపాయలు మాత్రమే ఉండగా ఇప్పుడు 40 రూపాయలు వసూలు చేస్తున్నారు ఆటోడ్రైవర్లు. వడ్డాది నుండి వయా గౌరీపట్నం మీదగా చోడవరంకి 35 రూపాయలు వసూలు చేస్తున్నారు వడ్డాది, బంగారుమెట్ట, లోపూడి, ఎల్ సింగవరం ,చినఅప్పన్నపాలెం తదితర గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తండ్రులే తమ పిల్లలను ఎక్కించుకొని విద్యార్థినులను నదీ పరివాహక ప్రాంతంలో దాటించే పరిస్థితి కనబడుతోంది. మూగజీవాలు సైతం రాకపోకలకు ఆలోచిస్తున్నాయి.
Paddy Issue: వర్షాలతో అన్నదాతల అగచాట్లు