పీఆర్సీపై ఏపీలో దుమారం రేగుతోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం 11వ పీఆర్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పీఆర్సీ పై ఉద్యోగసంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం వద్దు కానీ.. ఆర్టీసీ ఆదాయం మాత్రం కావాలా..? అని ఆయన ప్రశ్నించారు. పీటీడీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు.. ప్రమోషన్లు తక్షణం చేపట్టాలని అన్నారు. ఆర్టీసీ ఆస్పత్రులన్నీ అప్డేట్ చేయాలని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పేరు చెప్పే ఆర్టీసీ ఉన్నతాధికారులు.. చర్యలు మాత్రం తీసుకుంటామంటారు.
మేం చర్చలకు వెళ్లినా.. చర్చలకు రాలేదని ప్రభుత్వం మమ్మల్ని తప్పు పడుతోంది. జీతాలు ఇవ్వకుంటే ఉద్యోగుల్లో అన్ రెస్ట్ వస్తుందని ప్రభుత్వం భావిస్తోందేమో..? వచ్చే నెల 1న పాత జీతాలే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పీఆర్సీ పై చర్చించేందుకు ఇప్పటికే చాలా సార్లు ప్రయత్నించామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఎంతో ఆశపడ్డమని ఆయన అన్నారు. పీఆర్సీపై క్లారిటీ వచ్చే వరకు పాత జీతాలే ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు.