జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.. పవన్, రాజమండ్రి సభకోసం జనసేన ఏర్పాట్లు చేస్తోంది. సర్కార్‌కు పవన్‌కు మధ్య తాజాగా రగులుతున్న రాజకీయం నేపథ్యంలో సత్తా చాటాలని జనసేన నేతలు భావిస్తున్నారు. భారీ ఎత్తున జనసమీకరణతో బలాన్ని నిరూపించే ప్రయత్నాల్లో ఉన్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీపైన పవన్ బహిరంగ సభ జరగాల్సి ఉంది. కానీ, పోలీసుల అనుమతి నిరాకరణతో రాజమండ్రి రూరల్ బాలాజీపేట సెంటర్‌కు బహిరంగ సభను మార్చినట్టు చెబుతున్నారు. ఇదే హుక్కంపేట-బాలాజీపేట రోడ్డులో పవన్ శ్రమధానం చేస్తాని ప్రకటించారు జనసేన నేతలు. అయితే వేదికను మార్చినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నారు జనసేన నేతలు.
అయితే, పోలీసులు మాత్రం పవన్ కల్యాణ్ సభకు కోవిడ్ సాకును చూపిస్తున్నారు. బహిరంగ సభ నిర్వహించే ప్రాంతం విశాలంగా ఉండాలంటున్నారు. ఇరుకు ప్రాంతంలో సభ నిర్వహిస్తే కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కేంద్రం నింబధనలతో పాటు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆర్డర్స్ కూడా అమలులో ఉన్నాయని, వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని సభా వేదికను ఎంచుకోవలంటున్నారు. ఇప్పటికీ తాము జనసేన నేతలతో టచ్‌లో ఉన్నామని, తాము అడిగిన క్లారిఫికేషన్స్ ఇస్తే సభకు అనుమతులు ఇస్తామంటున్నారు. కానీ, జనసేన నేతలు మాత్రం పోలీసులు కావాలనే సభను అడ్డుకునేందకు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆరు నూరైనా సభను నిర్వహించి తీరుతామంటున్నారు. దీంతో.. పవన్ సభపై ఉత్కంఠ నెలకొంది.