ఏపీ రాజకీయాల్లో డ్రగ్స్, గంజాయి వ్యవహారంపై చేసిన విమర్శలు, ఆరోపణలు కాస్త శృతిమించి తీవ్ర వివాదానికి, కేసులకు దారి తీశాయి.. అయితే, మరోసారి డ్రగ్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖ అర్బన్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గంజాయి సాగును కట్టడి చేసేందుకు ఏపీ పోలీసులకు పూర్తి అధికారం, చేసే పరిస్థితులు ఇవ్వండి.. 48 గంటల్లో కట్టడి చేస్తారన్నారు. కానీ, ఈ ప్రభుత్వం వారికి అధికారాలు ఇవ్వదని ఆరోపించారు. ఇక, రోడ్ల దుస్థితిపై ఎలా ఉద్యమించామో అలాగే ఏపీలో గంజాయి సాగు, స్మగ్లింగ్ గురించి అదే విధంగా జనసేన ఉద్యమిస్తుందని ప్రకటించారు పవన్ కల్యాణ్.
Read Also: టీఆర్‌ఎస్ ‘విజయగర్జన‘ సభ వాయిదా.. కారణం అదేనా..?
ఇక, విశాఖ మన్యంలో రూ.4 వేల కోట్ల గంజాయి సాగు అవుతోందంటూ అంచనా వేశారు పవన్ కల్యాణ్.. అది లేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే… అఖిల పక్షం తీసుకువెళ్ళండి.. ఉంటే అందరం కలిసే ధ్వంసం చేద్దాం అని ప్రభుత్వానికి సూచించారు.. లేదంటే ఆ రూ.4 వేల కోట్ల గంజాయి దేశంలోకి వచ్చేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. షారుఖ్ ఖాన్ కుమారుడి వ్యవహారంపై స్పందించిన జనసేన అధినేత… షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దగ్గర ఉందో లేదో తెలియదు… కానీ, కేసులు నమోదు చేశారు. మరి ఇన్ని వేల కోట్ల గంజాయి ఉన్న చోట ఎంత బలంగా చట్టం పనిచేయాలి..? అని ప్రశ్నించారు. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగించుకొని ఎక్కడ గంజాయి సాగు అవుతుంది అనేది కనిపెట్టలేరా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు పవన్ కల్యాణ్.